అక్షరటుడే వెబ్డెస్క్: Lalitha Panchami | శరన్నవరాత్రుల్లో ( Navratri ) ఐదో రోజైన ఆశ్వయుజ శుక్లపక్ష పంచమిని ‘లలితా పంచమి’గా అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఆదిశక్తి స్వరూపమైన శ్రీ లలితా త్రిపురసుందరీదేవిని ఈ రోజున విశేషంగా ఆరాధిస్తారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ వారు కూడా ఈ రోజు లలితా త్రిపురసుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. లలితా పంచమి విశిష్టత, పూజా విధానం, సువాసిని పూజ ప్రాధాన్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Lalitha Panchami | లలితాదేవి ఆవిర్భావ పురాణగాథ..
పరమేశ్వరుని మూడో కన్ను నుంచి వెలువడిన అగ్నిజ్వాలలకు మన్మథుడు దహనమయ్యాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ మన్మథుడి భస్మం నుంచే ‘భండాసురుడు’ అనే అసురుడు జన్మించాడు. అపార శక్తిని సంపాదించిన భండాసురుడు ముల్లోకాల్లో దేవతలను, మునులను తీవ్రంగా వేధించడంతో.. దేవతలంతా ఆదిశక్తిని ప్రార్థించారు. వారి మొరను ఆలకించిన జగన్మాత ‘లలితా త్రిపురసుందరీదేవి’గా అవతరించి భండాసురుడిని సంహరించి లోకాలను రక్షించింది.
నైవేద్యాలు..
పసుపు రంగు చేమంతులు, ఎరుపు గులాబీలు, మందార పూలతో అమ్మవారిని పూజించాలి. లలితా సహస్రనామం, లలితా పంచరత్నం పారాయణం చేయడం ఎంతో శ్రేయస్కరం. అమ్మవారికి కదంబ ప్రసాదం, పులిహోర, బూరెలు, అరటిపండ్లు వంటివి నైవేద్యంగా సమర్పించాలి.
Lalitha Panchami | సువాసిని పూజ ప్రాధాన్యం..
ఇవాళ ముత్తైదువులను (సువాసినులను) సాక్షాత్తూ అమ్మవారి రూపంగా భావించి పూజించడం ఆచారంగా వస్తోంది. ముత్తైదువుల పాదాలకు పసుపు రాసి, కాళ్లకు పారాణి పెట్టి భోజనం పెట్టాలి. ఆ తర్వాత వారిని సత్కరించి పసుపు, కుంకుమ, గాజులు, పూలు, చీర, రవికె వంటి సుమంగళి వస్తువులను తాంబూలంగా ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకోవాలి.
పఠించాల్సిన మంత్రాలు..
లలితా పంచమి రోజున భక్తిశ్రద్ధలతో ‘ఓం శ్రీ మాత్రే నమః’ అనే మంత్రాన్ని జపించాలి. అలాగే అమ్మవారి దివ్య నామాలను స్మరిస్తూ పూజించడం వల్ల సకల సౌభాగ్యాలు, సుఖసంతోషాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
ఇది కూడా చదవండి: Kamareddy Traffic Problems | ట్రాఫిక్తో టెన్షన్..టెన్షన్.. కామారెడ్డి విస్తరణకు నోచుకోని రోడ్లతో అవస్థలెన్నో