LPG Shortage India | హోర్ముజ్ సంక్షోభం .. గ్యాస్ నిల్వలపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో ఎల్‌పీజీ (వంటగ్యాస్) సిలిండర్లకు తీవ్ర కొరత ఏర్పడుతుందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి స్పష్టతనిచ్చారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: LPG Shortage India | పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో ఎల్‌పీజీ (వంటగ్యాస్) సిలిండర్లకు తీవ్ర కొరత ఏర్పడుతుందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్  ( Hardeep Puri )పూరి స్పష్టతనిచ్చారు. ఆ వార్తలన్నీ పూర్తిగా అవాస్తవమని, ప్రజలు ఎలాంటి పుకార్లను నమ్మవద్దని ఆయన తేల్చిచెప్పారు. దేశంలో గ్యాస్ కొరత తలెత్తకుండా ప్రభుత్వం అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకుందని భరోసానిచ్చారు.

LPG Shortage India | ఉత్పత్తి భారీగా పెంపు..

హోర్ముజ్ జలసంధి వివాదం వల్ల అంతర్జాతీయంగా కొంత ప్రభావం పడటం సహజమే అయినప్పటికీ, ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు దేశం సిద్ధంగా ఉందని మంత్రి వెల్లడించారు. పరిస్థితిని ముందే అంచనా వేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, దేశీయంగా గ్యాస్ ఉత్పత్తిని పెంచాలని ఆదేశించినట్లు తెలిపారు. ఒకప్పుడు దేశంలో రోజుకు కేవలం 34,000 టన్నుల ఎల్‌పీజీ మాత్రమే ఉత్పత్తి కాగా, ప్రస్తుతం ఆ ఉత్పత్తి ఏకంగా 55,000 నుంచి 56,000 టన్నులకు పెరిగిందని వివరించారు. దీనివల్ల దేశంలో ఎక్కడా గ్యాస్ కొరత అనే సమస్యే తలెత్తదని స్పష్టం చేశారు.

LPG Shortage India | ఇంధన సరఫరా సజావుగా ..

దేశవ్యాప్తంగా ఉన్న 1.07 లక్షల పెట్రోల్ బంకుల్లో ఇంధన కొరత లేదని, సరఫరా ఎక్కడా ఆగకుండా క్రమం తప్పకుండా జరుగుతోందని మంత్రి తెలిపారు. సిలిండర్ల కోసం ప్రజలు ఆందోళన చెంది బయటకు వచ్చి క్యూలలో నిలబడాల్సిన అవసరం లేదన్నారు. డిజిటల్ బుకింగ్ సదుపాయం ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని, ఇంట్లోనే కూర్చుని ఫోన్ ద్వారా యాప్‌లో బుక్ చేసుకుంటే 24 గంటల్లోనే సిలిండర్ ఇంటికి చేరుతుందని గుర్తుచేశారు.

LPG Shortage India |అవసరానికి మించి నిల్వ ..

కొందరు కావాలనే గ్యాస్ కొరత ఉంటూ తప్పుడు ప్రచారాలు సృష్టిస్తున్నారని, దీంతో ప్రజలు భయపడి అవసరానికి మించి సిలిండర్లను దాచిపెట్టుకుంటున్నారని (హోర్డింగ్) పూరి ఆందోళన వ్యక్తం చేశారు. గురుగ్రామ్‌లో పైప్‌లైన్ గ్యాస్ కనెక్షన్ ఉన్న తమ కుటుంబ స్నేహితులు కూడా పుకార్లు నమ్మి ఎక్స్‌ట్రా సిలిండర్లు కొనుగోలు చేశారని ఒక ఉదాహరణగా చెప్పారు. సాధారణంగా దేశవ్యాప్తంగా రోజుకు సగటున 52 లక్షల సిలిండర్లు ఖర్చవుతుంటే, ఈ పుకార్ల వల్ల ఒక్కసారిగా ఆ సంఖ్య రోజుకు 90 లక్షలకు పెరిగిపోయిందని తెలిపారు.

ఒక సగటు కుటుంబానికి ఏడాదికి సరిపడే సిలిండర్ల కంటే నాలుగింతలు ఎక్కువగా కొనుగోలు చేయడం వల్ల పంపిణీ వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పడుతుందని మంత్రి పేర్కొన్నారు. బ్లాక్ మార్కెటింగ్, హోర్డింగ్‌ను అరికట్టడానికి, పంపిణీ వ్యవస్థను మరింత క్రమబద్ధీకరించడానికే ప్రభుత్వం కొన్ని తాత్కాలిక నిబంధనలు తీసుకువచ్చిందని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి:  GGH Service Book Collections | రూ.6వేలు కొట్టు.. సర్వీస్​ బుక్​ పట్టు.. జీజీహెచ్​లో దర్జాగా వసూళ్లు..

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *