అక్షరటుడే, ఆర్మూర్: Natyamayuri Award | కళలకు కాణాచి అయిన రవీంద్ర భారతి వేదిక మరోసారి నృత్య ఝరులతో (Classical Dance) పులకించింది. ఆర్మూర్‌కు (Armoor) చెందిన మంజునాథ నృత్యకళా నిలయం, మెట్టుపల్లి శాఖకు చెందిన చిన్నారులు శ్రీహర్షిత, శ్రీహిత “నాట్యమయూరి” పురస్కారాన్ని రెండోసారి అందుకుని అందరి మన్ననలు పొందారు.
Natyamayuri Award | రవీంద్రభారతిలో..
సిరి అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం రవీంద్ర భారతిలో నిర్వహించిన జాతీయ స్థాయి నృత్యోత్సవంలో ఈ అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. గురువు లోకం కవిత శిక్షణలో రాటుదేలిన ఈ ఇద్దరు చిన్నారులు భరతనాట్యం(Bharatanatyam), కూచిపూడి అంశాల్లో చేసిన ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. గతంలో కూడా ‘నాట్యమయూరి’ అవార్డు అందుకున్న హర్షిత, శ్రీహిత ఈసారి మరింత పరిణతితో కూడిన అభినయం, హావభావాలతో న్యాయనిర్ణేతల ప్రశంసలు అందుకున్నారు. ‘శివ తాండవం’, ‘దశావతారం’ అంశాలను ప్రదర్శించి సభికుల నుంచి నీరాజనాలు అందుకున్నారు.
Natyamayuri Award | గురువుకు దక్కిన గౌరవం
ఆర్మూర్, మెట్టుపల్లి ప్రాంతాల్లో నృత్య కళను విస్తృతంగా ప్రచారం చేస్తున్న గురువు లోకం కవిత కృషిని నిర్వాహకులు ప్రత్యేకంగా అభినందించారు. ‘మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన పిల్లల్లో ఇంతటి ప్రతిభ ఉండడం, వరుసగా రెండోసారి జాతీయ స్థాయి అవార్డు సాధించడం గురువుగా నాకు దక్కిన గొప్ప వరం’ అని కవిత మేడం భావోద్వేగంతో తెలిపారు.
Natyamayuri Award | ప్రముఖుల ప్రశంసలు..
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ నాట్యాచార్యులు చిన్నారులను, గురువును శాలువాతో సత్కరించారు. ‘కళను వ్యాపారంగా కాకుండా సేవగా భావించి శిక్షణ ఇస్తున్న కవిత లాంటి గురువులు ఉండబట్టే భారతీయ శాస్త్రీయ కళలు ఇంకా సజీవంగా ఉన్నాయని వారు కొనియాడారు. తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు హర్షిత, శ్రీహిత ఆనందం వ్యక్తం చేశారు. ఆర్మూర్ ప్రాంతానికి చెందిన చిన్నారులు హైదరాబాద్ వేదికపై రెండోసారి కీర్తి పతాకం ఎగురవేయడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ