అక్షరటుడే, కామారెడ్డి: Interstate Theft Gang | దోపిడీ కేసుల్లో పాల్గొంటున్న ఐదుగురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను కామారెడ్డి టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) బుధవారం వివరాలు వెల్లడించారు.
Interstate Theft Gang | నేరాల నియంత్రణ..
ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి రైల్వేస్టేషన్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకుని వేలిముద్రలను పరిశీలించగా వారి గత నేరచరిత్ర వెలుగులోకి వచ్చింది. వారి వద్ద నుంచి రూ.4 వేల నగదు, 3 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం పట్టణంలోని జయశంకర్ కాలనీకి చెందిన అజ్జన్ నిరేష్ ఇంటి తాళం పగులగొట్టి రూ.2 వేల నగదు చోరీకి సంబంధించి కేసు నమోదైన వెంటనే దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ పుటేజీ, సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించారు. విచారణలో నిందితులు మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌కు చెందినవారని, ఒక అంతర్రాష్ట్ర ముఠాగా ఏర్పడ్డారని తెలిసింది. వారు వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులు, ఏటీఎంలు, బస్టాండ్లు, రద్దీ ప్రాంతాల్లో హాత్ సఫాయి, బాబాగిరి, నకిలీ నోట్ల తనిఖీ పేరుతో మోసం చేసి నగదు, బంగారు ఆభరణాలు చోరీ చేస్తున్నట్లు తేలింది.
Interstate Theft Gang | కత్తులతో బెదిరించి..
రాత్రి సమయాల్లో ఇళ్లలో చోరీలు, అవసరమైతే కత్తులతో బెదిరించి దోపిడీలకు పాల్పడినట్లు నిందితులు ఒప్పుకున్నారు. గత నెల 27న మహారాష్ట్ర నుంచి కామారెడ్డికి వచ్చిన నిందితులు మరుసటి రోజు ఎస్బీఐ ఇందిరానగర్ శాఖలో బ్యాంకు నుంచి డబ్బు తీసిన వ్యక్తి వద్ద డబ్బులు లెక్కించి ఇస్తామని రూ.15 వేలు కొల్లగొట్టారు. ఈనెల 3న నిజామాబాద్‌లో కత్తులతో బెదిరించి నగదు దోచుకున్నారు. 4న కామారెడ్డిలో ఇంటి చోరీ చేశారు. తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లో సుమారు 80 నేరాలకు పాల్పడినట్లు, ముఖ్యంగా బెంగళూరులోనే 50కి పైగా నేరాలకు చేసినట్లు వెల్లడించారు.
Interstate Theft Gang | నాగ్‌పూర్ జిల్లాకు చెందిన ముఠా..
పట్టుబడిన ముఠా సభ్యులు మహారాష్ట్ర నాగపూర్ జిల్లా కాంప్టీకి చెందిన మహమ్మద్ అలీ రజాక్, మహమ్మద్ నాసిర్, మహమ్మద్ సాదిక్, మహమ్మద్ షాహిద్ రజాక్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఎస్.కె. ఫైజాన్గా గుర్తించారు. వీరిపై కామారెడ్డి టౌన్, నిజామాబాద్‌తో పాటు మహారాష్ట్ర బల్లార్షా, చంద్రపూర్‌లోనూ కేసులు ఉన్నాయి. గతంలో హైదరాబాద్ నారాయణగూడ, చార్మినార్, మార్కెట్, ఉప్పల్ పోలీస్ స్టేషన్లలోనూ వీరిపై కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. వీరిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలిస్తున్నట్టు ఎస్పీ తెలిపారు.
ఇది కూడా చదవండి..: Online Betting Arrest | ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో మరొకరి అరెస్ట్..: ఎస్పీ రాజేష్ చంద్ర