అక్షరటుడే వెబ్‌డెస్క్: Nor’easter Storm | అమెరికా ( US ) తూర్పు తీరంలో ‘నార్‌ఈస్టర్’ (Nor’easter) తుఫాన్ తీవ్ర బీభత్సం సృష్టిస్తోంది. ఈ తుఫాన్ ప్రభావంతో న్యూయార్క్, న్యూజెర్సీ సహా పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాషింగ్టన్ డీసీ నుంచి మైనే వరకు తీర ప్రాంతమంతా తుఫాన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. బలమైన ఈదురుగాలులు వీస్తుండటంతో తీర ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
Nor’easter Storm | భారీ నష్టం..
తుఫాన్ ఉధృతికి బ్రూక్లిన్‌లో ఓ పెద్ద చెట్టు కూలిపోవడంతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. నిరంతరం కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోగా, ప్రజలు ఇళ్లకే పరిమితం కావాల్సి వచ్చింది. మరోవైపు, విద్యుత్ వ్యవస్థ దెబ్బతినడంతో లక్షకు పైగా ఇళ్లకు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది.
Nor’easter Storm | అస్తవ్యస్తంగా విమాన సర్వీసులు..
ప్రతికూల వాతావరణం కారణంగా రవాణా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైంది. ఇప్పటివరకు సుమారు 400 విమానాలు రద్దయినట్లు సమాచారం అందగా, వెయ్యికి పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ఎయిర్‌పోర్టుల్లో వేల సంఖ్యలో ప్రయాణికులు గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు.
Nor’easter Storm | మరింత ముప్పు ..
రానున్న మరికొన్ని గంటల్లో తుఫాన్ ప్రభావం మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రస్తుతం అమెరికాలో తుఫాన్ భీకర రూపానికి సంబంధించిన దృశ్యాలు, చెట్లు విరిగిపడటం, ప్రజలు పరుగులు తీస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: ED Office Protest | ఈడీ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత