అక్షరటుడే, వెబ్‌డెస్క్: Shravan Masam 2026 | హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన, దైవిక మాసంగా భావించే శ్రావణమాసం ఆగస్టు 13వ తేదీ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. శివుడు, శ్రీమహావిష్ణువు, మహాలక్ష్మీదేవి , మంగళగౌరీదేవికి అత్యంత ప్రీతికరమైన ఈ మాసంలో ఆలయాలు భక్తులతో కళకళలాడనున్నాయి.
Shravan Masam 2026 | శుభకార్యాలు ప్రారంభం..
గత కొంతకాలంగా శుభముహూర్తాలు పరిమితంగా ఉండటంతో వివాహాలు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు, నూతన వ్యాపారాల ప్రారంభోత్సవాలు వాయిదా పడ్డాయి. శ్రావణమాసం ప్రారంభం కావడంతో ఈ శుభకార్యాలు మళ్లీ ఊపందుకోనున్నాయి. దీనివల్ల వస్త్ర దుకాణాలు, బంగారు నగల వ్యాపారులు, పూల వ్యాపారులు, డెకరేషన్, షామియానా, లైటింగ్, ఫోటోగ్రాఫర్లు, ట్రావెల్స్, టైలర్లు, వాయిద్య కళాకారులు, పురోహితులకు ఉపాధి అవకాశాలు భారీగా పెరగనున్నాయి.
Shravan Masam 2026 | ప్రధాన పండుగలు, ప్రత్యేక పూజలు ..
శ్రావణ మాసంలో పరమేశ్వరునితో పాటు వరలక్ష్మీ వ్రతం, రాఖీ పూర్ణిమ, నాగపంచమి, కామికా ఏకాదశి, సంకటహర చతుర్థి వంటి ఎన్నో ముఖ్యమైన పండుగలు రానున్నాయి. ఈ మాసంలో వచ్చే ప్రధాన పండుగలు, వ్రతాల తేదీలు:
ఆగస్టు 13వ తేదీన శ్రావణమాసం ప్రారంభం కానుండగా, ఆగస్టు 17న నాగుల పంచమి వేడుకలు జరగనున్నాయి. ఈ మాసంలో వచ్చే శ్రావణ సోమవారాలను ఆగస్టు 17, 24, 31 , సెప్టెంబర్ 7 తేదీలలో జరుపుకోనుండగా, మంగళగౌరీ వ్రతాలను ఆగస్టు 18, 25, సెప్టెంబర్ 1 , 8 తేదీలలో ఆచరించనున్నారు. అలాగే ఆగస్టు 28వ తేదీన అత్యంత విశిష్టమైన వరలక్ష్మి వ్రతం , రాఖీ పౌర్ణమి (Rakhi Purnima ) పర్వదినాలు ఒకే రోజు రానున్నాయి. ఆ తర్వాత సెప్టెంబర్ 4న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుగనుండగా, సెప్టెంబర్ 11వ తేదీన శ్రావణ అమావాస్య (పోలాల అమావాస్య)తో ఈ పవిత్ర మాసం ముగియనుంది.
Shravan Masam 2026 | కఠినమైన ఉపవాస దీక్షలు..
ఈ మాసంలో భక్తులు మాంసాహారం, మద్యపానానికి పూర్తిగా దూరంగా ఉంటూ కఠినమైన ఉపవాస దీక్షలు ఆచరిస్తారు. శివాలయాల్లో రుద్రాభిషేకాలు, విష్ణు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, లక్ష్మీదేవి ఆలయాల్లో కుంకుమార్చనలు నిర్వహిస్తారు. కొందరు పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటే, మరికొందరు నదీస్నానాలు, అన్నదానాలు, గోపూజలు చేస్తూ శ్రావణ మాసాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు.
ఇది కూడా చదవండి: Nizamabad Couple Suicide | నగరంలో విషాదం.. ఆర్థిక ఇబ్బందులతో దంపతుల ఆత్మహత్య