Etela Rajender | కాళేశ్వరంపై కాంగ్రెస్ వాదన దుర్మార్గం: ఈటల రాజేందర్

రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణపై మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Etela Rajender | రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణపై మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తనకు ఏ పార్టీ, ఏ వ్యక్తిగత అజెండా కంటే కూడా తెలంగాణ ( Telangana )ప్రయోజనాలే అత్యంత ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నా, ప్రాజెక్టుల్లో నీటి లభ్యత ఉన్నా.. మోటార్లు ఆన్ చేయకపోవడం వల్ల రైతులు పంటలు సాగు చేయలేక ఇబ్బందులు పడుతున్నారని ఈటల విమర్శించారు.

Etela Rajender | నీటిపై అవగాహన అవసరం..

ఎస్ఆర్ఎస్పీ (SRSP) కాల్వల కింద కేవలం బోర్లు, బావులపైనే ఆధారపడి వ్యవసాయం చేయడం అసాధ్యమని, దీనిపై కనీస అవగాహన ఉన్నవారెవరైనా అంగీకరిస్తారని ఈటల అన్నారు. తాను హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తూములు ఎత్తి రైతులకు నీరు అందించినపుడు ఎలాగైతే ప్రశంసలు దక్కాయో, ఒకవేళ ఆ నీరు అందకపోతే వరంగల్ రైతులు కూడా తనను నిలదీసేవారని తన గతాన్ని గుర్తు చేసుకున్నారు.

eetala.1 1

Etela Rajender | సాగునీటి ప్రాజెక్టులపై ఈటల విశ్లేషణ..

కాళేశ్వరం ప్రాజెక్టు రాకముందు ఉన్న పరిస్థితులు, ప్రాజెక్టుల చరిత్రను ఈటల వివరించారు. నీళ్లు, నిధులు, ఆత్మగౌరవం అనే నినాదంతోనే తెలంగాణ ఉద్యమం మొదలైందని, అధికారంలో ఉన్నవారు రాజకీయాలకు అతీతంగా మూలాలను గుర్తుంచుకోవాలని సూచించారు. కాళేశ్వరానికి ముందు వైఎస్సార్ హయాంలో జలయజ్ఞం మొదలైందని, తమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత నీటి కోసం అప్పుడే ప్రణాళికలు రూపొందాయని పేర్కొన్నారు. శ్రీపాద ఎల్లంపల్లి, మిడ్ మానేరు వంటి ప్రాజెక్టుల శంకుస్థాపన కాంగ్రెస్ హయాంలోనే జరిగిందని, కాళేశ్వరం నీటిని చేవెళ్ల వరకు తీసుకెళ్లాలనే ఆలోచన కూడా అప్పటిదేనని గుర్తు చేశారు.

Etela Rajender | దుర్మార్గమైన విమర్శలు ఆపండి..

రాష్ట్రం ఏర్పడ్డాక మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులను అనుసంధానం చేయడం వల్లనే ఉత్తర తెలంగాణకు నీరు అందుతోందని ఈటల పేర్కొన్నారు. మిడ్ మానేరు డ్యామ్ ఉత్తర తెలంగాణకు ఒక ‘నీటి జంక్షన్’గా మారిందని, గతంలో నీటి సౌకర్యం లేని హుజూరాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో నేడు కాళేశ్వరం నీటి వల్ల రెండు పంటలు పండుతున్నాయన్నది అక్షర సత్యమని ఆయన అన్నారు. కాళేశ్వరంలో జరిగిన కమీషన్లు, డిజైన్ల మార్పుల గురించి తాను మాట్లాడటం లేదని, అయితే ‘ప్రాజెక్టు కట్టడమే తప్పు’ అని ప్రభుత్వం మాట్లాడుతున్న మాటలు అత్యంత దుర్మార్గమని విమర్శించారు. కరువు పరిస్థితులు వస్తున్నాయని తెలిసి కూడా ప్రాజెక్టు రిపేర్లలో ప్రభుత్వం జాప్యం చేయడంపై ఈటల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి:  Koheda Fish Market | మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలి : మంత్రి వాకిటి శ్రీహరి

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *