West Bengal Violence | బెంగాల్‌లో టీఎంసీ పరాజయం తర్వాత హింసాత్మక ఘటనలు.. మమతా బెనర్జీ చిత్రాలు ధ్వంసం

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: West Bengal Violence | పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేశాయి. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) ఘన విజయం సాధించగా, దశాబ్ద కాలంగా అధికారంలో కొనసాగిన తృణమూల్ కాంగ్రెస్ పరాజయాన్ని చవిచూసింది. ఈ పరిణామంతో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

ఓటమి అనంతరం టీఎంసీ నాయకులు (TMC Leaders), కార్యకర్తల్లో ఆందోళన నెలకొనగా, కొన్ని ప్రాంతాల్లో పార్టీ కార్యాలయాలు మూతపడినట్లు సమాచారం. పశ్చిమ మిడ్నాపూర్, ఖరగ్‌పూర్ వంటి ప్రాంతాల్లో పలువురు నేతలు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు ప్రచారం సాగుతోంది.

West Bengal Violence | ఫలితాల తర్వాత చెల‌రేగిన హింస‌

ఎన్నికల ఫలితాల ప్రకటన వెంటనే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కోల్‌కతా నగరంలోని టోలీగంజ్, కస్బా, బారానగర్, హౌరా ప్రాంతాల్లో టీఎంసీ కార్యాలయాలపై దాడులు జరిగినట్లు సమాచారం. టోలీగంజ్‌లో మాజీ మంత్రి అరూప్ బిశ్వాస్ కార్యాలయాన్ని ఆందోళనకారులు ధ్వంసం చేయగా, రూబీ క్రాసింగ్ వద్ద కౌన్సిలర్ సుశాంత ఘోష్ కార్యాలయంపై దాడులు జరిగాయి. జమురియా ప్రాంతంలో పార్టీ కార్యాలయానికి నిప్పు పెట్టిన ఘటన పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. అసన్‌సోల్, బరాబాని, బారీపూర్, తుఫాన్‌గంజ్ ప్రాంతాల్లో టీఎంసీ ఫ్లెక్సీలు, బ్యానర్లు చించేశారు. ముఖ్యంగా మమతా బెనర్జీ (Mamata Banerjee), అభిషేక్ బెనర్జీ చిత్రాలను ధ్వంసం చేయడం కలకలం రేపింది.

West Bengal Violence | ఆధిపత్యం చెలాయించిన టీఎంసీ నేతలు

గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఆధిపత్యం చెలాయించిన టీఎంసీ నేతలు, ఇప్పుడు ఎదురుదాడులతో భయాందోళనలో ఉన్నారని స్థానిక సమాచారం. ఈ ఘటనలపై టీఎంసీ తీవ్రంగా స్పందించింది. అధికారం చేపట్టిన వెంటనే బీజేపీ తన అసలు స్వరూపాన్ని బయటపెట్టిందని ఆరోపించింది. సామాజిక మాధ్యమ వేదికల ద్వారా స్పందించిన పార్టీ నాయకత్వం, రాష్ట్రంలో గందరగోళం సృష్టించడమే బీజేపీ లక్ష్యమని విమర్శించింది. మరోవైపు, బీజేపీ ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించింది. ఈ దాడులతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ, ఫలితాల తర్వాత కార్యకర్తలు శాంతిని పాటించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని తెలిపింది.

రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఈ ఘటనల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రభావిత ప్రాంతాల్లో భారీగా భద్రతా బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నారు. అయినప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఒకవైపు విజయం ఉత్సాహం, మరోవైపు ఓటమి నిరాశతో కూడిన పరిస్థితుల్లో రాష్ట్రం ఉద్రిక్తంగా మారింది.

ఇది కూడా చదవండి..: Sudha Reddy Met Gala | మెట్ గాలాలో సుధా రెడ్డి.. రూ. 140 కోట్ల టాంజానైట్ నెక్లెస్‌తో మెరుపులు!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *