అక్షరటుడే వెబ్‌డెస్క్: DK Shivakumar CM | కర్ణాటక రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ( DK Shivakumar) జూన్ 3వ తేదీన బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఈ విషయాన్ని శనివారం బెంగళూరులో జరిగిన విలేకరుల సమావేశంలో కేపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జీసీ చంద్రశేఖర్ అధికారికంగా వెల్లడించారు. ఇటీవల ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేయడంతో, కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాల మేరకు డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్నారు. బెంగళూరులోని లోక్‌భవన్ ఆవరణలో ఉన్న గ్లాస్ హౌస్‌లో జూన్ 3న ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత సరళంగా, నిరాడంబరంగా జరగనుందని ఆయన పేర్కొన్నారు.

DK Shivakumar CM | ట్రాఫిక్ సమస్యల వల్లే భారీ ఈవెంట్ రద్దు..
నిజానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అభిమానులు, కాంగ్రెస్ శ్రేణుల సమక్షంలో భారీ బహిరంగ సభ ద్వారా ఈ వేడుకను నిర్వహించాలని మొదట భావించారు. అయితే, బెంగళూరు నగరంలో తలెత్తే ట్రాఫిక్ ఇబ్బందులు, ప్రస్తుత ఇంధన సంక్షోభాన్ని పరిగణనలోకి తీసుకుని ఆ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు చంద్రశేఖర్ వివరించారు. ఎలాంటి హంగు ఆర్భాటాలకు పోకుండా, కేవలం సేవా దృక్పథం ఉట్టిపడేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పార్టీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ బెంగళూరుకు తరలివచ్చి ప్రజలకు, ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

DK Shivakumar CM | జిల్లాల్లో సీఎం పర్యటన..
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత డీకే శివకుమార్ స్వయంగా కర్ణాటకలోని అన్ని జిల్లా కేంద్రాలలో పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయా జిల్లాల్లో పర్యటించి ప్రజల, కార్యకర్తల ఆశీస్సులు నేరుగా తీసుకుంటారని చంద్రశేఖర్ వెల్లడించారు. కాగా, జూన్ 3న జరిగే ఈ ప్రధాన వేడుకలో డీకే శివకుమార్‌తో పాటు మరికొందరు సీనియర్ నేతలు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని సమాచారం.
ఇది కూడా చదవండి: Harish Rao Criticism | కావాలంటే పేరు మార్చుకోండి.. బడుల అభివృద్ధిని ఆపకండి: హరీశ్ రావు


