అక్షరటుడే, వెబ్‌డెస్క్: Abhishek Banerjee attack | పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అత్యంత శక్తివంతమైన నేతగా, తృణమూల్ కాంగ్రెస్ (TMC) సెకండ్-ఇన్-కమాండ్‌గా గుర్తింపు పొందిన అభిషేక్ బెనర్జీపై స్థానిక ప్రజలు రాళ్లు, కోడిగుడ్లతో దాడికి దిగడం బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది. ఎన్నికల హింసాబాధితులను పరామర్శించేందుకు సోనార్‌పుర్ వెళ్లిన సందర్భంలో ఈ ఘటన జరగడం గమనార్హం.
తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీకి అత్యంత బలమైన కోటగా భావించే దక్షిణ 24 పరగణాల జిల్లాలోని ఒక నియోజకవర్గమే ఈ సోనార్‌పుర్. అలాంటి గడ్డపైనే, పార్టీలో నంబర్-2 నాయకుడైన అభిషేక్ బెనర్జీకి స్థానిక ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవడం క్షేత్రస్థాయిలో అతడిపై నిరువు గప్పిన వ్యతిరేకతకు నిలువెత్తు నిదర్శనంగా చెబుతున్నారు.
Abhishek Banerjee attack | పేరుకుపోయిన అసంతృప్తి
ఎన్నికల సమయంలో, ఆ తర్వాత జరిగిన హింసపై సామాన్య ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. బాధితులను పరామర్శించడానికి వచ్చిన ప్రతి పక్ష నేతలపై ప్రజలు తిరగబడటం వెనుక.. “హింసకు కారణం అతడే” అనే భావన బలంగా నాటుకుపోవడమే ప్రధాన కారణం.
Abhishek Banerjee attack | కంటితుడుపు చర్యగా భావించడం
హింస జరిగిన వెంటనే కాకుండా, ఆలస్యంగా పరామర్శలకు రావడం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమేనని స్థానికులు భావించి ఉండవచ్చు. ఆ సమయంలో ఓదార్పు కంటే వారిలో ఉన్న ఆక్రోశం కట్టలు తెంచుకుంది.
అధికారంలోకి వచ్చి నెల కాకముందే పోలీసులు కనిపించకుండా పోయారని స్వయంగా అభిషేక్ బెనర్జీ విమర్శించడం ఇక్కడ ఒక విచిత్రమైన రాజకీయ వైరుధ్యం.

Abhishek Banerjee attack | సహజ ఆగ్రహమే?
“ఇదేనా వారి ప్రజాస్వామ్యం?” అని అభిషేక్ ప్రశ్నించడం వెనుక రాజకీయ చతురత కనిపిస్తోంది. ఈ దాడికి బీజేపీనే కారణమని టీఎంసీ ఆరోపిస్తుండగా.. ఇది ప్రజల నుంచి వచ్చిన సహజ ఆగ్రహమేనని అధికారపక్షాలు వాదిస్తున్నాయి. రాజకీయ పార్టీలు ఈ ఘటనను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి.
Abhishek Banerjee attack | నిరసన స్వరం
వీవీఐపీ (VVIP) భద్రత మధ్య తిరిగే నేతలకు, క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితులకు మధ్య ఉన్న దూరాన్ని ఈ ఘటన స్పష్టం చేస్తోంది. భద్రతా సిబ్బంది సాయంతో ఆయన సురక్షితంగా బయటపడగలిగారు కానీ, సామాన్య ప్రజల నిరసన స్వరం మాత్రం గట్టిగానే వినిపించింది.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో “హింస” అనేది ఒక దీర్ఘకాలిక సమస్యగా మారిపోయింది. ఎవరు అధికారంలో ఉన్నా ఎన్నికల తదనంతర హింస సామాన్యుడి జీవితాలను అతలాకుతలం చేస్తోంది.
అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడి.. కేవలం ఒక పార్టీపై జరిగిన దాడి కాదు.. వ్యవస్థపై, నిరంతర హింసపై ప్రజల్లో ఉన్న అసహనానికి ఇది ప్రతీక.
కేవలం రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలతో కాలం వెళ్లదీయకుండా.. శాంతిభద్రతలను కాపాడటం, ప్రజల్లో నమ్మకాన్ని పునరుద్ధరించడం ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వానికైనా అత్యంత కీలకం. ఈ ఘటన నియంతలా ప్రవర్తించే పాలక వర్గానికి ఒక హెచ్చరిక లాంటిది.


