Suvendu Adhikari | బెంగాల్ ప్రమాణ స్వీకార వేదికపై అపూర్వ దృశ్యం.. వృద్ధ నేత పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్న మోదీ

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్ : Suvendu Adhikari | పశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో శనివారం జరిగిన అట్టహాసమైన వేడుకలో బీజేపీ నేత సువేందు అధికారి రాష్ట్ర తొలి భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో 207 స్థానాలతో ఘనవిజయం సాధించిన భాజపా, దశాబ్దాల కమ్యూనిస్టుల పాలనను, 15 ఏళ్ల తృణమూల్ కాంగ్రెస్ హవాను తుడిచిపెట్టి అధికారాన్ని హస్తగతం చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరైన ఈ వేడుక లక్షలాది మంది కార్యకర్తల కేరింతల మధ్య సాగింది.

Suvendu Adhikari | వేదికపై ఆసక్తికర సన్నివేశం..

ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం కేవలం రాజకీయ వేడుకగా మాత్రమే కాకుండా, పార్టీ విలువలను చాటిచెప్పే వేదికగా నిలిచింది. వేదికపై ఉన్న 98 ఏళ్ల వృద్ధుడు మఖన్‌లాల్ సర్కార్‌ను ప్రధాని మోదీ శాలువాతో సత్కరించి, ఆయన పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవడం అందరినీ ఆకట్టుకుంది. పార్టీని క్షేత్రస్థాయి నుంచి నిర్మించిన పాత తరం నాయకులకు మోదీ ఇచ్చిన ఈ గౌరవం నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది. అంతేకాకుండా, వేడుక అనంతరం బెంగాల్ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రధాని మోదీ మోకాళ్లపై వంగి నమస్కరించడం ఆ క్షణానికి మరింత భావోద్వేగాన్ని జోడించింది.

Suvendu Adhikari | ఎవరీ మఖన్‌లాల్ సర్కార్?

మోదీ పాదాభివందనం చేసిన మఖన్‌లాల్.. బెంగాల్‌లో బీజేపీ పునాదులు వేసిన సీనియర్ నేత. స్వతంత్ర భారత తొలి రోజుల్లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీతో కలిసి కశ్మీర్ జాతీయోద్యమంలో పాల్గొన్న యోధుడు. 1952లో కశ్మీర్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినందుకు జైలు శిక్ష కూడా అనుభవించారు. 1980లో పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి ఉత్తర బెంగాల్ జిల్లాల్లో పార్టీ పటిష్టతకు అలుపెరుగని కృషి చేశారు. కేవలం ఏడాది కాలంలోనే పదివేల మందిని సభ్యులుగా చేర్చిన ఘనత ఆయనది. తన జీవితకాల స్వప్నమైన బెంగాల్‌లో భాజపా ప్రభుత్వాన్ని నేడు కళ్లారా చూసి ఆయన ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు.

ఇది కూడా చదవండి: Bandi Bhagirath | కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడి వివాదం..!

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *