Saudi Job Scam|సౌదీ ఎడారిలో జగిత్యాల యువకుడి నరకయాతన.. ‘నన్ను కాపాడండి’ అంటూ సెల్ఫీ వీడియో వైరల్

Shivam nagarani

అక్షరటుడు వెబ్‌డెస్క్:Saudi Job Scam|ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి మోసపోతున్న తెలంగాణ కార్మికుల జాబితాలో మరో యువకుడు చేరాడు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం బిబి రాజ్ పల్లి గ్రామానికి చెందిన దాసరి అరవింద్ (23) అనే యువకుడు సౌదీ అరేబియా ఎడారిలో చిక్కుకొని, ప్రాణభయంతో విలపిస్తున్నాడు. “నన్ను ఎలాగైనా కాపాడండి.. ఇక్కడ ఉండలేకపోతున్నాను” అంటూ అతను పంపిన సెల్ఫీ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారి కన్నీళ్లు పెట్టిస్తోంది.

Saudi Job Scam|ప్యాకింగ్ వర్కర్ ఉద్యోగం అని నమ్మించి..

కుటుంబ ఆర్థిక పరిస్థితులను మెరుగుపర్చుకోవాలనే ఉద్దేశంతో అరవింద్ ఉపాధి కోసం విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఒక ఏజెంట్ అరవింద్‌ను సంప్రదించి, సౌదీలో ప్యాకింగ్ వర్కర్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. ఇందుకోసం అరవింద్ నుంచి రూ. 90 వేలు వసూలు చేశాడు. తీరా అక్కడికి వెళ్ళాక ఏజెంట్ అసలు స్వరూపం బయటపడింది. రియాద్ నగరానికి సుమారు 950 కిలోమీటర్ల దూరంలో ఉన్న మారుమూల ఎడారి ప్రాంతానికి అరవింద్‌ను గొర్రెల కాపరిగా పంపించి ఏజెంట్ చేతులెత్తేశాడు.

Saudi Job Scam|యజమాని వేధింపులు..

ఎడారి ప్రాంతంలో ఎండవేడిమికి తోడు, కనీసం తాగడానికి నీరు, తినడానికి సరైన ఆహారం లేక అరవింద్ తీవ్ర అవస్థలు పడుతున్నాడు. దీనికి తోడు అక్కడ యజమాని తనను నిరంతరం వేధిస్తున్నాడని, కనీస మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నాడని అరవింద్ సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. కొత్త ప్రదేశంలో, భాష తెలియక, ఎవరిని సంప్రదించాలో తెలియని స్థితిలో ఉన్న తనను రక్షించి స్వదేశానికి రప్పించాలని అతను తెలంగాణ ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలను వేడుకుంటున్నాడు. ఈ వీడియో చూసిన అరవింద్ కుటుంబ సభ్యులు ఆందోళనలో మునిగిపోయారు.

 

 

ఇది కూడా చదవండి: Suvendu Adhikari | బెంగాల్ ప్రమాణ స్వీకార వేదికపై అపూర్వ దృశ్యం.. వృద్ధ నేత పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్న మోదీ

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *