అక్షరటుడే దెబ్‌డెస్క్: Iran US Tensions | అమెరికా, ఇరాన్ దేశాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఐక్యరాజ్యసమితి వేదికగా ఇరు దేశాలు పరస్పరం తీవ్ర హెచ్చరికలు జూలు విసిరిన వేళ, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ భగ్గుమన్నాయి. ఒకవేళ అమెరికా లేదా ఇజ్రాయెల్ ( Israel ) తమపై మరోసారి సైనిక దాడికి దిగితే, ఈ యుద్ధ రంగం హిందూ మహాసముద్రం వరకు విస్తరించవచ్చని ఇరాన్ సుప్రీం లీడర్ సలహాదారు యాహ్యా రహీమ్ సఫావీ హెచ్చరించారు.
ఇరాన్ ప్రభుత్వ మీడియా ద్వారా విడుదల చేసిన వీడియో సందేశంలో సఫావీ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్, హార్ముజ్ జలసంధి నుంచి ఎర్ర సముద్రం వరకు పరిమితమైన ఘర్షణలు.. భవిష్యత్తులో మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉందని స్పష్టం చేశారు. అయితే హిందూ మహాసముద్రంలో ఏయే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటారనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. మార్చి నెలలో శ్రీలంక తీరానికి సమీపంలో ఇరాన్ యుద్ధనౌకను అమెరికా జలాంతర్గామి ముంచిన ఘటనను ఈ సందర్భంగా పరిశీలకులు గుర్తుచేస్తున్నారు.
Iran US Tensions | ఇరాన్ అధ్యక్షుడి తిరస్కరణ..
మరోవైపు, ఒప్పందం కుదుర్చుకోకపోతే ఇరాన్‌ను సర్వనాశనం చేస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ తీవ్రంగా తిరస్కరించారు. అమెరికా బెదిరింపులకు, ఒత్తిళ్లకు ఇరాన్ ఎప్పటికీ తలొగ్గదని తేల్చిచెప్పారు. అదే సమయంలో, యుద్ధాన్ని ముగించేందుకు దౌత్యపరమైన చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని, అయితే బలవంతపు ధోరణులను సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.
Iran US Tensions | చమురు రవాణాపై తీవ్ర ప్రభావం..
ప్రపంచ చమురు సరఫరాకు కీలకమైన హార్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్లు అప్రమత్తమయ్యాయి. అమెరికా తన సైనిక ఒత్తిడిని, నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేస్తేనే హార్ముజ్ మార్గాన్ని పూర్తిగా తెరుస్తామని ఇరాన్ షరతులు విధిస్తోంది. ఈ పరిణామాలు భారత్ వంటి దేశాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. పశ్చిమాసియా సంక్షోభం మరింత ముదిరితే చమురు ధరలు, రవాణా వ్యయాలు పెరిగే ప్రమాదముందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Vijaya Lakshmi Hospital | బండారి విజయలక్ష్మి హాస్పిటల్లో అన్నదానం..