Harish Rao Defamation Case | క్షుద్రపూజల ఆరోపణల కేసు.. కోర్టుకు హాజరైన హరీశ్ రావు

కాంగ్రెస్ నేతలు తనపై చేసిన క్షుద్రపూజల ఆరోపణలను మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్:  Harish Rao Defamation Case | కాంగ్రెస్ నేతలు తనపై చేసిన క్షుద్రపూజల ఆరోపణలను మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. తనపై నిరాధార ప్రచారం చేశారంటూ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌కు ఇప్పటికే లీగల్ నోటీసులు పంపినప్పటికీ వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో.. ఆయన కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ నేపథ్యంలో గురువారం స్వయంగా కోర్టుకు హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. వ్యక్తిగత విషయాలపై ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఎవరు చేసినా, ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. తాను దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించిందని, వచ్చే బుధవారం స్టేట్‌మెంట్‌ రికార్డు చేస్తుందని తెలిపారు.

Harish Rao Defamation Case | కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ ..

ఎన్నికల సమయంలో అడ్డగోలు హామీలిచ్చిన కాంగ్రెస్ పార్టీ.. వాటి అమలును తాము ప్రశ్నిస్తుంటే ప్రజల దృష్టిని మళ్లించేందుకు డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతోందని హరీశ్ రావు మండిపడ్డారు. ఆరు గ్యారెంటీలు ఏమయ్యాయని ప్రభుత్వాన్ని నిలదీశారు. శాసనసభలోనూ అధికార పార్టీ అబద్ధాలు చెబుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇన్ని ఏళ్లవుతున్నా.. ప్రివిలేజ్ కమిటీకి చైర్మన్‌గా ఉండే డిప్యూటీ స్పీకర్ పదవిని ఇప్పటివరకు భర్తీ చేయలేదని విమర్శించారు. అసెంబ్లీని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Harish Rao Defamation Case | రాజీనామా చేయించాలని డిమాండ్..

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెంపపెట్టు లాంటిదని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. నిత్యం రాజ్యాంగాన్ని చేతపట్టుకుని తిరిగే రాహుల్ గాంధీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. పార్టీ మారిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. ఇవాళ కాకపోయినా రేపైనా మిగతా పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఇదే పరిస్థితి ఎదురుకాక తప్పదని ఆయన స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి:  Vijaya Lakshmi Hospital | బండారి విజయలక్ష్మి హాస్పిటల్​లో అన్నదానం..

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *