Bangkok floods | నీట మునిగిన బ్యాంకాక్‌.. భారీ వర్షాలతో థాయ్‌లాండ్‌ అతలాకుతలం..మూడు రోజుల్లో 320 మి.మీ. వర్షపాతం.. 23 మంది దుర్మరణం

సెప్టెంబరు 16 నుంచి థాయ్‌లాండ్‌లో కొనసాగుతున్న వరదల కారణంగా 23 మంది మృతి చెందినట్లు దేశ విపత్తు నిర్వహణ అధికారులు వెల్లడించారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Bangkok floods | భారీ వర్షాలు, వరదలతో థాయ్‌లాండ్‌ అతలాకుతలమైంది. దేశ రాజధాని బ్యాంకాక్‌లో గత కొన్ని రోజులుగా కురిసిన కుండపోత వర్షాలకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.

కేవలం రెండు నుంచి మూడు రోజుల్లోనే నగరంలో సుమారు 320 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఇది సెప్టెంబరు నెలలో సాధారణంగా నమోదయ్యే మొత్తం వర్షపాతానికి దాదాపు సమానమని అధికారులు తెలిపారు.

Bangkok floods | రోడ్లపై భారీగా వరద నీరు

భారీ వర్షాలతో బ్యాంకాక్‌లోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. రహదారులపై వరద నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు వరద నీటిలోనే ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. 50 జిల్లాలను వరద విపత్తు ప్రాంతాలుగా ప్రకటించినట్లు స్థానిక నివేదికలు పేర్కొన్నాయి.

Bangkok floods | ఎయిర్‌పోర్టుల్లోనూ ఇబ్బందులు

వరద ప్రభావం విమాన రాకపోకలపైనా పడింది. బ్యాంకాక్‌లోని ప్రధాన విమానాశ్రయాలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నప్పటికీ, వరదలు, రహదారులపై నీటిముంపు, సిబ్బంది కొరత కారణంగా విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయి. థాయ్‌ ఎయిర్‌వేస్‌ పలు విమానాలను రద్దు చేసింది.

సువర్ణభూమి విమానాశ్రయంలో వేలాది బ్యాగేజీలు పేరుకుపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సెప్టెంబరు 16 నుంచి థాయ్‌లాండ్‌లో కొనసాగుతున్న వరదల కారణంగా 23 మంది మృతి చెందినట్లు దేశ విపత్తు నిర్వహణ అధికారులు వెల్లడించారు. 29 ప్రావిన్సులు, బ్యాంకాక్‌ సహా భారీ సంఖ్యలో ప్రజలు వరదల ప్రభావానికి గురయ్యారు.

Amala Paul comments | హీరోయిన్ల అభ్యంతరకర సీన్లపై అమలాపాల్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇప్పుడు అలాంటి పాత్రలు చేయనంటూ!

Bangkok floods | మరో రెండు మూడు రోజుల్లో నీరు తగ్గే అవకాశం

వర్షాలు తగ్గుముఖం పట్టడంతో బ్యాంకాక్‌లో నిలిచిన వరద నీరు మరో రెండు నుంచి మూడు రోజుల్లో తొలగే అవకాశం ఉందని థాయ్‌ ప్రభుత్వం అంచనా వేసింది. అయితే కొత్తగా భారీ వర్షాలు కురిస్తే పరిస్థితి మళ్లీ తీవ్రతరం కావచ్చని అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. భారీ వర్షాలు, వరదలు, విమాన సర్వీసులకు అంతరాయంతో బ్యాంకాక్‌లో సాధారణ జనజీవనం తీవ్రంగా ప్రభావితమైంది.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *