Naga Chaitanya | స‌మంత‌తో రిలేష‌న్ షిప్‌పై అస‌త్య ప్ర‌చారాలు.. ఢిల్లీ హైకోర్టుని ఆశ్ర‌యించిన నాగ చైత‌న్య‌

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Naga Chaitanya | టాలీవుడ్ ప్రముఖ నటుడు నాగచైతన్య తన వ్యక్తిగత హక్కుల పరిరక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా, ఆయనకు కీలక ఉపశమనం లభించింది.

నటి సమంతతో తన గత వైవాహిక జీవితాన్ని ప్రస్తావిస్తూ కొన్ని వెబ్‌సైట్లు, యూట్యూబ్ ఛానెళ్లు అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నాయని ఆరోపిస్తూ నాగచైతన్య పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ, నటుడి ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా ఆయన పేరు, ఫొటోలు, వీడియోలను ఉపయోగించరాదని స్పష్టం చేసింది.

Naga Chaitanya | ఢిల్లీ హైకోర్టుకు నాగ చైతన్య

జస్టిస్ జ్యోతి సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించింది. విచారణ సందర్భంగా నాగచైతన్య తరఫున సీనియర్ న్యాయవాది వైభవ్ గగ్గర్ వాదనలు వినిపించారు. కొన్ని ఆన్‌లైన్ వేదికలు ఎలాంటి ఆధారాలు లేకుండా సమంత (Samantha)ను నాగచైతన్య మోసం చేశాడని, ఆమె కెరీర్‌ను దెబ్బతీశాడని ప్రచారం చేస్తున్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇలాంటి కథనాలు సాధారణ విమర్శల పరిధిలోకి రావని, అవి వ్యక్తిగత వేధింపులు, ట్రోలింగ్‌కు సమానమని ఆయన వాదించారు. ఈ వాదనలను పరిశీలించిన హైకోర్టు, వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసే కంటెంట్‌పై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో సంబంధిత వెబ్‌సైట్లు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లకు నోటీసులు జారీ చేస్తూ, తదుపరి విచారణ వరకు వివాదాస్పద కంటెంట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది.

Naga Chaitanya | సోషల్ మీడియా వేదికల్లో నిరాధార ఆరోపణలు

Naga Chaitanya

నాగచైతన్య, సమంతల ప్రేమకథ తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు ఎంతో చర్చనీయాంశమైంది. ‘ఏ మాయ చేసావే’ సినిమా సమయంలో పరిచయమైన వీరిద్దరూ కొన్నేళ్ల పాటు ప్రేమించుకుని 2017లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయితే నాలుగేళ్ల వైవాహిక జీవితం అనంతరం 2021 అక్టోబర్‌లో పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు ప్రకటించారు. విడాకుల తర్వాత కూడా వీరి వ్యక్తిగత జీవితాలపై సోషల్ మీడియా, డిజిటల్ వేదికల్లో తరచూ చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి.

Naga Chaitanya

అయితే ఇద్దరూ తమ జీవితాల్లో ముందుకు సాగుతూ కొత్త అధ్యాయాలను ప్రారంభించారు. నాగచైతన్య 2024 డిసెంబర్‌లో నటి శోభితా ధూళిపాళ్లను వివాహం చేసుకోగా, సమంత 2025 డిసెంబర్‌లో దర్శకుడు రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్నారు. ఇద్దరూ తమ వ్యక్తిగత జీవితాల్లో స్థిరపడినప్పటికీ, పాత విషయాలను మళ్లీ మళ్లీ ప్రస్తావిస్తూ కొందరు సోషల్ మీడియా వేదికల్లో నిరాధార ఆరోపణలు, వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని నాగచైతన్య తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇలాంటి ప్రచారాలు తన వ్యక్తిగత గౌరవానికి, వృత్తిపరమైన ప్రతిష్ఠకు నష్టం కలిగిస్తున్నాయని ఆయన కోర్టుకు వివరించారు.

ఇది కూడా చదవండి..: Vijay Trisha | అజిత్ ఇంటికి కలిసి వెళ్లిన విజయ్, త్రిష

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *