అక్షరటుడే, వెబ్‌డెస్క్: Ayodhya Kashi Tour | ఆధ్యాత్మిక యాత్రలు చేసే ప్రయాణికుల కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) ఎప్పటికప్పుడు కొత్తకొత్త టూర్ ప్యాకేజీలతో ముందుకొస్తోంది.
తాజాగా అయోధ్య, కాశి పుణ్య క్షేత్ర యాత్ర’ పేరుతో టూర్ ప్యాకేజీని తీసుకువచ్చింది. భారత్ గౌరవ్ పర్యాటక రైలు ద్వారా ఈ యాత్ర సాగుతుంది. తెలంగాణ (Telangana), ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) భక్తులు పూరీ జగన్నాథ ఆలయం, అయోధ్య రామమందిరం, కాశీ విశ్వనాథ ఆలయం వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడానికి ఈ ప్యాకేజీ అనుకూలంగా ఉంటుంది. ప్యాకేజీ వివరాలు తెలుసుకుందామా..
Ayodhya Kashi Tour | యాత్ర సమయం..
అయోధ్య, కాశి పుణ్య క్షేత్ర యాత్ర ఆగస్టు 4వ తేదీన ప్రారంభమవుతుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి బయలుదేరే ఈ ప్రయాణం మొత్తం 9 రాత్రులు 10 రోజుల పాటు కొనసాగుతుంది.
Ayodhya Kashi Tour | సందర్శించే పుణ్యక్షేత్రాలు…
పూరీలోని జగన్నాథ ఆలయం, కోణార్క్‌లోని ప్రపంచ ప్రసిద్ధ సూర్య దేవాలయం, గయలోని పవిత్ర విష్ణుపాద ఆలయం, కాశిలో విశ్వనాథ ఆలయం, విశాలాక్షి ఆలయం, అన్నపూర్ణా దేవి ఆలయ దర్శనం, సాయంత్రం వేళ జరిగే ప్రసిద్ధ గంగా హారతి వీక్షణ, అయోధ్యలో భవ్య రామాలయం, హనుమాన్‌గఢి దర్శనం, సరయూ నది హారతి, ప్రయాగ్‌రాజ్‌లోని పవిత్ర త్రివేణి సంగమ స్థానాలను దర్శించుకోవచ్చు.
Ayodhya Kashi Tour | ప్యాకేజీ చార్జీలు..
ప్రయాణికులు కోరుకునే రైలు క్లాస్, వసతి సౌకర్యాలను బట్టి టూర్ ప్యాకేజీ చార్జీలుంటాయి.
స్లీపర్ క్లాస్ (ఎకానమీ ప్యాకేజీ) : ఒక్కో వ్యక్తికి రూ. 16,500.
థర్డ్ ఏసీ (స్టాండర్డ్ ప్యాకేజీ) : ఒకరికి రూ. 25,600.
సెకండ్ ఏసీ(కంఫర్ట్ ప్యాకేజీ) : ఒక్కో వ్యక్తికి రూ. 33,400.

కల్పించే వసతులు..
ఈ ప్యాకేజీలో రైలు టికెట్లతో పాటు, పుణ్యక్షేత్రాల సందర్శన కోసం బస్సు వసతి, హోటళ్లలో వసతి సౌకర్యం, రోజు శాకాహార భోజనం (ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం) అందిస్తారు. యాత్రికులకు సహాయం చేయడానికి ఒక ప్రొఫెషనల్ గైడ్ అందుబాటులో ఉంటారు. ప్రయాణికులందరికీ ట్రావెల్ ఇన్సూరెన్స్ కల్పిస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో బోర్డింగ్, డి-బోర్డింగ్ స్టేషన్లు..
సికింద్రాబాద్ జంక్షన్, చర్లపల్లి, కాజీపేట జంక్షన్, వరంగల్ , ఖమ్మం, విజయవాడ జంక్షన్, గుడివాడ జంక్షన్, భీమవరం జంక్షన్, తణుకు, నిడదవోలు జంక్షన్, రాజమండ్రి, సామర్లకోట జంక్షన్, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం.
బుకింగ్ విధానం..
ఈ పర్యాటక రైలులో మొత్తం 702 సీట్లున్నాయి. ఇందులో 160 స్లీపర్ క్లాస్ సీట్లు, 490 థర్డ్ ఏసీ సీట్లు, 52 సెకండ్ ఏసీ క్లాస్ సీట్లు. ఆసక్తిగల భక్తులు ఐఆర్సీటీసీ అధికారిక వెబ్సైట్ https://www.irctctourism.com ను సందర్శించి టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి..: Export Duty Fuel | పెట్రోల్, డీజిల్‌పై ఎగుమతి సుంకం తగ్గించిన కేంద్రం


