Telangana Railway Connectivity | రూ. 16,555 కోట్లతో 5 కొత్త రైల్వే లైన్లు.. 8 వెనుకబడిన జిల్లాలకు రైలు సేవలు

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Telangana Railway Connectivity | తెలంగాణలోని అన్ని జిల్లాలకు పూర్తిస్థాయి రైల్వే కనెక్టివిటీని అందించేందుకు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ప్రతిష్ఠాత్మక ప్రణాళికను సిద్ధం చేసింది.

రాష్ట్రంలో ఇప్పటివరకు రైల్వే నెట్‌వర్క్ లేని 8 కీలక జిల్లాలను అనుసంధానిస్తూ.. రూ. 16,555 కోట్ల భారీ అంచనా వ్యయంతో కొత్త రైలు మార్గాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.

తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లో ప్రతి జిల్లాకు రైలు సౌకర్యం కల్పించాలనేది ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం తుది సర్వేలకు (FLS) ఆమోదం తెలపడమే కాకుండా.. వివరణాత్మక ప్రాజెక్టు నివేదికల (DPRs) రూపకల్పనను వేగవంతం చేసింది. ఈ కొత్త రైల్వే లైన్ల ఏర్పాటుతో లక్షలాది మంది ప్రయాణికులకు లబ్ధి చేకూరడంతో పాటు, ప్రాంతీయ వాణిజ్యం, పరిశ్రమలకు పెద్దపీట పడనుంది.

Kamareddy Train Accident

Telangana Railway Connectivity | రైల్వే మ్యాప్‌లోకి ఎక్కనున్న 8 కొత్త జిల్లాలు

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు సరైన రైలు కనెక్టివిటీ లేని 8 జిల్లాల కేంద్రాలను ఈ ప్రాజెక్టు ద్వారా ప్రధాన రైల్వే నెట్‌వర్క్‌తో అనుసంధానించనున్నారు.

భూపాలపల్లి, ములుగు, సిరిసిల్ల, నిర్మల్, నారాయణపేట, సూర్యాపేట, నాగర్‌కర్నూల్, సంగారెడ్డి జిల్లాలు ఈ నూతన మార్గాల ద్వారా లబ్ధి పొందనున్నాయి. ఇటీవల కాలంలో ఇప్పటికే మెదక్, జగిత్యాల, సిద్దిపేట, కరీంనగర్ జిల్లా కేంద్రాలకు రైల్వే లైన్లు విస్తరించారు.

Telangana Railway Connectivity | ఆర్థిక వృద్ధికి ఊతం..

దక్షిణ మధ్య రైల్వే (SCR) అధికారుల సమాచారం ప్రకారం.. భూపాలపల్లి-కాజీపేట (హసన్‌పర్తి) మధ్య రూ. 1,152 కోట్లతో చేపట్టనున్న 64 కిలోమీటర్ల రైల్వే లైన్ సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ఎంతో తోడ్పడనుంది.

ఈ లైన్ ములుగు జిల్లాలోని ప్రసిద్ధ మేడారం భక్తులకు రవాణా సౌకర్యాన్ని మెరుగుపర్చనుంది. దీనికితోడు భూపాలపల్లి ప్రాంతం నుంచి కాకతీయ థర్మల్ పవర్ స్టేషన్, రామగుండం ఎన్టీపీసీ, విష్ణుపురంలో రాబోయే యాదాద్రి పవర్ ప్లాంట్‌కు బొగ్గు రవాణాను సులభతరం చేయనుంది. అంతేకాకుండా మహారాష్ట్ర, కర్ణాటక లోని విద్యుత్తు కేంద్రాలకు సింగరేణి బొగ్గును తరలించడానికి ఇది దగ్గరి మార్గంగా మారనుంది.

Paddy 2

Telangana Railway Connectivity | పంటల రవాణాకు వరం

మరో కీలకమైన పటాన్‌చెరు – ఆదిలాబాద్ నూతన రైల్వే లైన్ దాదాపు 317 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. సంగారెడ్డి, నిర్మల్ జిల్లాల మీదుగా వెళ్లే ఈ మార్గం రైతాంగానికి వరప్రదాయినిగా కానుంది.

ఈ ప్రాంతంలో పండే వరి, పత్తి, మొక్కజొన్న, పసుపు, చెరకు వంటి పంటలను దేశంలోని ఇతర ప్రాంతాలకు వేగంగా, తక్కువ ఖర్చుతో తరలించడానికి ఈ లైన్ ఎంతో సహాయపడుతుందని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. కొత్త ట్రాక్‌ల ఏర్పాటు ద్వారా అటు ప్రయాణికులకు లబ్ధి చేకూరడంతో పాటు రైల్వేకు గూడ్స్ రవాణా ద్వారా భారీ ఆదాయం సమకూరనుంది.

Japan Mango Export Ban | పాలకుల నిర్లక్ష్యం.. పర్యవేక్షణ లోపం…..

Telangana Railway Connectivity | రైలు మార్గాల ప్రాజెక్టు వివరాలు..

  • పటాన్‌చెరు – ఆదిలాబాద్ (317 కి.మీ.) :– సంగారెడ్డి, నిర్మల్ – రూ. 5,706 కోట్లు
  • డోర్నకల్ – గద్వాల్ (296 కి.మీ.):- సూర్యాపేట, నాగర్‌కర్నూల్ – రూ. 5,330 కోట్లు
  • వికారాబాద్ – కృష్ణ:– నారాయణపేట – రూ. 2,196 కోట్లు
  • మనోహరాబాద్ – కొత్తపల్లి:– సిరిసిల్ల – రూ. 1,373 కోట్లు
  • భూపాలపల్లి – కాజీపేట (హసన్‌పర్తి):– (64 కి.మీ.) – భూపాలపల్లి, ములుగు – రూ. 1,152 కోట్లు
Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *