అక్షరటుడే వెబ్‌డెస్క్: CMRL ED Probe | కేరళ రాజకీయ, పారిశ్రామిక వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటైల్ లిమిటెడ్ (CMRL) కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. సీఎంఆర్‌ఎల్ సంస్థపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తునకు కేరళ హైకోర్టు పచ్చజెండా ఊపింది. సీఎంఆర్‌ఎల్, ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ సంస్థల మధ్య జరిగిన వివాదాస్పద ఆర్థిక లావాదేవీలపై ఈడీ తన విచారణను యథావిధిగా కొనసాగించవచ్చని న్యాయస్థానం స్పష్టం చేసింది.

CMRL ED Probe | అప్పీల్ దాఖలు ..
ఈ కేసులో ఈడీ దర్యాప్తును అనుమతిస్తూ గతంలో హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సీఎంఆర్‌ఎల్ యాజమాన్యం అప్పీల్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ ఎ. రాజా విజయరాఘవన్, జస్టిస్ కె.వి. జయకుమార్‌లతో కూడిన డివిజన్ బెంచ్.. ఆ అప్పీల్ పిటిషన్‌ను పూర్తిగా కొట్టివేసింది.

CMRL ED Probe | జోక్యానికి న్యాయస్థానం నిరాకరణ..
సింగిల్ జడ్జి ఇచ్చిన పాత ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి బలమైన కారణాలు లేవని డివిజన్ బెంచ్ అభిప్రాయపడింది. దర్యాప్తు సంస్థ తన విచారణను నిరభ్యంతరంగా ముందుకు తీసుకెళ్లవచ్చని పేర్కొంది. హైకోర్టు ఇచ్చిన ఈ తాజా తీర్పుతో సదరు సంస్థల మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీల వెనుక ఉన్న అసలు నిజాలను బయటకు తీసేందుకు ఈడీకి పూర్తి అధికారాలు లభించినట్లయింది.
ఇది కూడా చదవండి: Maruti Car Sales | ‘మారుతి’కి ఎదురేదీ?.. టాప్-10లో ఆరు ఈ కంపెనీ మోడళ్లే..
