అక్షరటుడే, వెబ్‌డెస్క్: Dhiraj Seth Army Chief | భారత సైన్యానికి తదుపరి సైన్యాధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ ( Dhiraj Seth )నియమితులయ్యారు. ప్రస్తుతం ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న జనరల్ ఉపేంద్ర ద్వివేది త్వరలో పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో జూన్ 30న లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ బాధ్యతలు చేపట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వం శనివారం అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ఆయన భారత సైన్యానికి వైస్ చీఫ్‌గా సేవలందిస్తున్నారు.
Dhiraj Seth Army Chief | భారత సైన్యంలో కీలక బాధ్యతలు
1986 డిసెంబర్లో ఆర్మర్డ్ కోర్స్‌లో చేరిన ధీరజ్ సేథ్, దాదాపు నాలుగు దశాబ్దాలుగా భారత సైన్యంలో కీలక బాధ్యతలను నిర్వర్తించారు. క్లిష్టమైన యుద్ధ పరిస్థితులతో పాటు, ఉగ్రవాద వ్యతిరేక పోరాటాల్లోనూ ఆయనకు అపారమైన అనుభవం ఉంది. ఎడారి ప్రాంతాల్లో ఆర్మ్‌ర్డ్ రెజిమెంట్‌కు, జమ్మూకశ్మీర్‌లో కౌంటర్-ఇన్సర్జెన్సీ దళాలకు కమాండర్‌గా ఆయన విశేష సేవలందించారు.

Dhiraj Seth Army Chief | సైనిక రంగంలో కీలక మైలురాళ్లు..
సుదర్శన్ చక్ర కార్ప్స్ కమాండర్, ఢిల్లీ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండర్‌గా సేవలందించారు. సౌత్ వెస్ట్రన్, సదరన్ కమాండ్లకు కమాండింగ్ ఇన్ చీఫ్‌గా పనిచేసి, ఆర్మీలోని కీలక ఆపరేషనల్ విభాగాళ్లకు నాయకత్వం వహించారు. ఐక్యరాజ్యసమితి మిషన్‌లో భాగంగా అంగోలాలో ఆపరేషన్స్ ఆఫీసర్‌గా, పారిస్‌లో కమాండ్ అండ్ స్టాఫ్ కోర్సు పూర్తి చేశారు. ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌లో అసిస్టెంట్ మిలిటరీ సెక్రటరీగా, బ్రిగేడియర్ జనరల్ స్టాఫ్‌గా, డైరెక్టర్ జనరల్ డిసిప్లిన్, సెరిమోనియల్ అండ్ వెల్ఫేర్ వంటి ఉన్నత పదవుల్లో పనిచేశారు. సైనిక సేకరణలు (అక్విజిషన్), కేపబిలిటీ డెవలప్మెంట్లో కీలక నిర్ణయాలు తీసుకోవడంలో మంచి అనుభవం ఉంది.
Dhiraj Seth Army Chief | విద్యాలో ప్రతిభ..
నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) పూర్వ విద్యార్థి అయిన ఆయన, చదువులోనూ ఎప్పుడూ ముందుండేవారు. జూనియర్ కమాండ్ కోర్సులో ప్రథమ స్థానంలో నిలవడంతో పాటు, డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీలో ‘బెస్ట్ ఆల్-రౌండ్ స్టూడెంట్ ఆఫీసర్’గా మెడల్ అందుకున్నారు. హయ్యర్ కమాండ్ కోర్స్ , ప్రతిష్టాత్మక నేషనల్ డిఫెన్స్ కాలేజీలో శిక్షణ పూర్తి చేసి, సైనిక వ్యూహరచనలో పట్టు సాధించారు.
ఇది కూడా చదవండి: Student Welfare Review | విద్యార్థులను సొంత బిడ్డలుగా భావించాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి