Kids Water Intake | చల్లగా ఉందని పిల్లలు నీళ్లు తక్కువ తాగుతున్నారా? నిపుణుల కీలక హెచ్చరిక

మిగతా కాలాలతో పోలిస్తే వర్షాకాలంలో చాలామంది నీళ్లు తక్కువగా తాగుతుంటారు

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Kids Water Intake | మిగతా కాలాలతో పోలిస్తే వర్షాకాలంలో చాలామంది నీళ్లు తక్కువగా తాగుతుంటారు. ముఖ్యంగా వాతావరణం చల్లగా ఉండటంతో పిల్లలు నీరు తాగడానికి ఆసక్తి చూపరు. తల్లిదండ్రులు కూడా పెద్దగా పట్టించుకోరు. కానీ, ఇది చాలా ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు (Medical Professionals )హెచ్చరిస్తున్నారు. అప్పుడప్పుడు అయితే పరవాలేదు కానీ, దీర్ఘకాలంగా నీరు తక్కువగా తీసుకోవడం వల్ల పిల్లల్లో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి తగ్గే అవకాశం ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 2019లో ‘అనల్స్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ మెటబాలిజం’ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది.

Kids Water Intake | అధ్యయనంలో వెల్లడైన నిజాలు..

పిల్లలపై నీరు తాగకపోవడం ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకునేందుకు 13 దేశాలకు చెందిన 6,469 మంది పిల్లలపై పరిశోధనలు జరిపారు. ఇందులో దాదాపు 60 శాతం మంది పిల్లలు రోజూ అవసరమైన మోతాదులో నీరు తాగడం లేదని తేలింది. దీనివల్ల ఏకాగ్రత లోపించడం, జ్ఞాపకశక్తి తగ్గడం, చదువులో వెనుకబడటం జరుగుతున్నట్లు నిపుణులు గుర్తించారు. పాఠశాలల్లో పిల్లలు తమ శరీరానికి అవసరమైన దానిలో కేవలం 14 శాతం నీటిని మాత్రమే తాగుతున్నారని, ఇది వారి శారీరక, మానసిక ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతుందని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Kids Water Intake | మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం..

నీరు తక్కువగా తాగడం కేవలం దాహానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు. ఇది పిల్లల్లో నరాల పనితీరు మందగించడానికి, మెదడు మొద్దుబారడానికి, శ్రద్ధ, జ్ఞాపకశక్తి తగ్గడానికి కారణమవుతుంది. అంతేకాకుండా, నీరు సరిగ్గా తాగని పిల్లల్లో ఆత్మవిశ్వాసం కొరవడటం, భావోద్వేగాల్లో స్థిరత్వం లేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు.

Kids Water Intake | వయసును బట్టి పిల్లలు ఎంత నీరు తాగాలి?

పిల్లల వయస్సును బట్టి వారు రోజూ తీసుకోవాల్సిన నీటి పరిమాణంపై నిపుణులు పలు సూచనలు చేశారు. దీని ప్రకారం, 1 నుండి 3 ఏళ్ల వయస్సు గల పిల్లలు సుమారు 4 కప్పులు (1 నుండి 1.3 లీటర్లు), 4 నుండి 8 ఏళ్ల వయస్సు పిల్లలు సుమారు 5 కప్పులు (1.1 నుండి 1.3 లీటర్లు), అలాగే 9 నుండి 13 ఏళ్ల వయస్సు గల పిల్లలు రోజుకు 7 నుండి 8 కప్పుల నీరు తాగడం తప్పనిసరి. కాబట్టి, వర్షాకాలమైనా లేదా చల్లటి వాతావరణం ఉన్నా పిల్లలు తగినన్ని నీరు తాగి హైడ్రేటెడ్‌గా ఉండేలా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి:  Sriramsagar Project | శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ వద్ద పర్యాటకుల సందడి

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *