అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Student Welfare Review | విద్యార్థులును సొంత బిడ్డల్లా చూసుకోవాలని.. ప్రభుత్వ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు, గురుకులాల నిర్వహణలో లోటుపాట్లు లేకుండా చూడాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) అన్నారు. కలెక్టరేట్లో విద్యాశాఖ అధికారులో సమీక్ష నిర్వహించారు.
Student Welfare Review | ఆహ్లాదకరమైన వాతావరణంలో..
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆరోగ్యకరమైన, ఆహ్లాదకర వాతావరణంలో విద్యార్థులు నాణ్యతతో కూడిన విద్యను అభ్యసించేలా నిర్వాహకులు కృషి చేయాలన్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని వసతి గృహాలు, పాఠశాలలు, కళాశాలలలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచడంతో పాటు దోమలు, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యార్థులకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు జరిపించాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన, పౌష్టికాహారం అందించడంతో పాటు ఆహార పదార్థాల నాణ్యతపై నిరంతర పర్యవేక్షణ నిర్వహించాలని తెలిపారు. ప్రతి పాఠశాల, వసతి గృహంలో డైట్ మెనూ పట్టికను విధిగా ప్రదర్శించాలని ఆదేశించారు. ఫుడ్ సేఫ్టీ కమిటీలు చురుకుగా పని చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
Student Welfare Review | విద్యాసంస్థల్లో స్వచ్ఛమైన తాగునీరు..
ప్రతి విద్యా సంస్థలో స్వచ్ఛమైన, రక్షిత తాగునీటి సరఫరా ఉండేలా చూడాలని, విద్యార్థుల ఆరోగ్య రక్షణ విషయంలో రాజీ పడకూదని కలెక్టర్ స్పష్టం చేశారు. నాణ్యమైన విద్యా బోధన జరిగేలా ప్రత్యేక పర్యవేక్షణ నిర్వహించాలని, విద్యార్థుల విద్యా ప్రమాణాలు మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల్లో వంద శాతం విద్యార్థుల నమోదు జరిగేలా కృషి చేయాలని హితవు పలికారు. అధికారులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. విద్యార్థులను సొంత పిల్లలుగా భావిస్తూ, వారి భద్రత, ఆరోగ్యం, సంక్షేమం, అభ్యున్నతి కోసం అంకిత భావంతో పని చేయాలని సూచించారు. ఆంగ్ల భాషలో విద్యార్థులు ప్రావీణ్యం సాధించేలా చూడాలన్నారు.
Student Welfare Review | పెండింగ్ పనులపై నివేదిక ఇవ్వండి..
బాలికల వసతి గృహాలు, పాఠశాలల్లో మరుగుదొడ్లు, మూత్రశాలలు అవసరం ఉన్నట్లయితే, ఈ నెల 20వ తేదీ లోపు వివరాలు సమర్పించాలని, అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు వెంటనే నిధులు మంజూరు చేస్తామని కలెక్టర్ తెలిపారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని, విద్యాసంస్థల నిర్వహణలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ విద్యార్థుల సమగ్రాభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.

ఆయా ప్రభుత్వ విద్యా సంస్థలలో పెండింగ్‌లో ఉన్న నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చొరవ చూపాలన్నారు. ఎవరినీ ఇబ్బంది పెట్టాలన్నది తమ అభిమతం కాదని, అయితే విద్యార్థుల భద్రత, సంక్షేమం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం బాధ్యులను ఉపేక్షించబోమని కలెక్టర్ స్పష్టం చేశారు. తాను ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని, నిర్వహణాపరమైన లోపాలు దృష్టికి వస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. సమీక్షలో అదనపు కలెక్టర్ భుజంగరావు, డీఎస్సీడీవో రజిత, జిల్లా విద్యా శాఖ అధికారి అశోక్, ఆర్సీవో, సంబంధిత సంక్షేమ శాఖల హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Birkoor House Theft | బీర్కూర్‌లో దొంగల హల్చల్.. తాళం వేసిన ఇంట్లో భారీ చోరీ..