అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Government Schools | రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) అన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన జరుగుతోందని ఆమె పేర్కొన్నారు. మోపాల్ మండలం బోర్గాం(పి) జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కలెక్టర్ బుధవారం సందర్శించారు.
Government Schools | బోర్గాం(పి) ఉన్నత పాఠశాలలో విద్యాబోధన భేష్..
బోర్గాం(పి) జడ్పీహెచ్ఎస్లో (Borgaon (P) ZPHS) విద్యార్థులకు ప్రవేశం కల్పించేందుకు తల్లిదండ్రులు పోటీ పడుతుండడాన్ని గమనించిన కలెక్టర్ వారితో భేటీ అయ్యారు. తమ పిల్లలను ప్రైవేటు బడుల నుంచి ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తున్నామని విద్యార్థుల తల్లిదండ్రులు తెలుపడంతో కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల భారం ఎక్కువగా ఉండడమే కాకుండా, బోర్గాం(పి) స్కూల్లో నాణ్యమైన విద్య (Quality Education) అందిస్తున్నారని తెలిసి ఇక్కడ చేర్పించేందుకు వచ్చామని తల్లిదండ్రులు కలెక్టర్కు వివరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పదో తరగతిలో 87శాతం సగటు ఉత్తీర్ణత సాధించిన బోర్గాం(పి) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉత్తమ బోధనకు నిదర్శనంగా నిలిచిందన్నారు.
Government Schools | ఆర్థిక స్థోమత కలిగిన వారు సైతం..
నాణ్యమైన విద్యా బోధనతో పాటు, అన్ని మౌలిక సదుపాయాలు ఉన్న ప్రభుత్వ బడుల్లో తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు చొరవ చూపుతున్నారని కలెక్టర్ అన్నారు. ఇదివరకు పేద కుటుంబాల పిల్లలు ప్రభుత్వ బడుల్లో చదువుకుంటారనే భావన ఉండేదని, ప్రస్తుతం ఆర్ధిక స్థోమత కలిగిన వారు కూడా నాణ్యమైన విద్య కోసం వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తుండడం శుభ పరిణామమని అన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పోటీ తత్వాన్ని పెంపొందించుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ బడులలో విద్యా ప్రమాణాలు, బోధనను మెరుగుపరుస్తోందని వివరించారు. ఉపాధ్యాయులకు బోధనా సామర్ధ్యాలను పెంపొందేలా శిక్షణ తరగతులను నిర్వహిస్తోందని గుర్తు చేశారు. విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, ఏకరూప దుస్తులతో పాటు అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందిస్తోందని పేర్కొన్నారు.
Government Schools | అదనపు తరగతి గదుల కోసం..
కాగా.. బోర్గాం(పి) పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు లేకపోవడంతో.. బడికి ఆనుకుని ఉన్న స్థలాన్ని సేకరించి పాఠశాలను మరింతగా విస్తరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఆయా తరగతులను సందర్శించి విద్యార్థుల బోధనా సామర్ధ్యాన్ని పరిశీలించి, బహుమతులు అందజేశారు. బాలబాలికలకు ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్ పంపిణీ చేశారు. కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, మోపాల్ తహశీల్దార్ రేఖ, ఎంఈవో సాయిలు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శంకర్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Anil Menon Mission | అంతరిక్షంలోకి భారత సంతతి వ్యోమగామి.. జులై 14న తొలి యాత్ర