Kamareddy Education Hub | ఉన్నత విద్య అందని ద్రాక్ష.. మాటలకే పరిమితమైన ఎడ్యుకేషన్​ హబ్​

కామారెడ్డి ఎడ్యుకేషన్ హబ్ మాట కాగితాలకే పరిమితం అవుతోంది. ఎంబీఏ, ఎంసీఏ వంటి కోర్సులు లేకపోవడంతో జిల్లా విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది.

Srinivas Kolluri

అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy Education Hub | కామారెడ్డి (Kamareddy) ఎడ్యుకేషన్ హబ్ మాట కాగితాలకే పరిమితం అవుతోంది. ఇక్కడికి ఎన్నికల ప్రచారానికి వచ్చే ప్రతి నాయకుడు జిల్లా కేంద్రాన్ని ఎడ్యుకేషన్ హబ్​గా మారుస్తామని హామీలు గుప్పించినా అది ఆచరణకు మాత్రం నోచుకోవడం లేదు. ఫలితంగా ఉన్నత చదువుల కోసం విద్యార్థులు ఇతర జిల్లాలకు వెళ్లాల్సి వస్తోంది. జిల్లా కేంద్రంలో అన్ని వసతులు.. ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉన్నా ఉన్నత విద్య మాత్రం మిథ్యగానే మిగిలిపోతోంది.

ప్రతి ఏటా జిల్లాలోని 20కి పైగా డిగ్రీ కళాశాలల నుంచి 3 వేల మందికి పైగా విద్యార్థులు బయటకు వస్తున్నారు. వీరిలో అత్యధికులు మేనేజ్‌మెంట్, ఐటీ రంగాలవైపు మొగ్గుచూపుతున్నారు. కానీ జిల్లా కేంద్రంలోనే ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు లేకపోవడంతో హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్ బాట పట్టాల్సి వస్తోంది. “డిగ్రీ అయిపోయింది. ఎంసీఏ చేద్దామంటే హైదరాబాద్ వెళ్లాలి. నెలకు రూ.15 వేలు ఖర్చవుతోంది. ఆ భారం మోయలేం” అని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Kamareddy Education Hub | గ్రామీణ విద్యార్థులకు శాపం

జిల్లాలో నగరాలకు వెళ్లి చదువుకునే స్థోమత ఉన్నవారు కొందరైతే, గ్రామీణ ప్రాంతాల్లో పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లల పరిస్థితి దయనీయంగా ఉంది. హాస్టల్ ఫీజు, భోజనం, రవాణా, కళాశాల ఫీజు కలిపి నెలకు రూ.20 వేలకు పైగా ఖర్చవుతుండటంతో చాలామంది మధ్యలోనే చదువుకు స్వస్తి పలుకుతున్నారు. చివరకు రూ.10 వేల జీతానికి ప్రైవేట్ ఉద్యోగాల్లో చేరిపోతున్నారు. ఐటీ, మేనేజ్‌మెంట్ రంగాల్లో లక్షల జీతాల ఉద్యోగాలు ఊరిస్తున్నా, అర్హత లేక వాటికి దూరమవుతున్నారు.

Kamareddy Education Hub | విన్నపాలు వృథానేనా?

గత పదేళ్లుగా విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోనైనా ఈ కోర్సులు ప్రారంభించాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకుంటూనే ఉన్నారు. అధికారులకు వినతిపత్రాలు, ఎమ్మెల్యేలకు విజ్ఞప్తులు ఇస్తున్నా ఫలితం మాత్రం కనిపించడం లేదు. ఓ వైపు ప్రభుత్వం ‘స్కిల్ డెవలప్‌మెంట్’ అంటోంది. మరి స్కిల్ కోసం కావాల్సిన కోర్సులే ఇక్కడ లేవని విద్యార్థి సంఘాలు విమర్శిస్తున్నాయి.

Kamareddy Education Hub | ప్రజాప్రతినిధులు స్పందించేనా?

Kamareddy Education Hub

కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఈ అంశంపై వెంటనే దృష్టి సారించాలని జిల్లా వాసులు కోరుతున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తక్షణమే ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు మంజూరు చేయించి, వచ్చే విద్యా సంవత్సరం నుంచే అడ్మిషన్లు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇది కూడా చదవండి..: RTA Vehicle Inspections | జిల్లావ్యాప్తంగా ఆర్టీఏ అధికారుల విస్తృత తనిఖీలు..

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *