DTO Venkanna Death | డీటీఓ వెంకన్న దుర్మరణంపై రాజకీయ దుమారం.. స్పందించిన ప్రభుత్వం.. సమగ్ర విచారణకు ఆదేశం

ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి, ప్రమాదానికి గల కారణాలను, వాస్తవాలను నిర్ధారించడానికి జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ (RSC) ఎమ్. చంద్రశేఖర్ గౌడ్‌ను విచారణ అధికారిగా (Enquiry Officer) ప్రభుత్వం నియమించింది.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: DTO Venkanna Death | విధి నిర్వహణలో ఉన్న భూపాలపల్లి జిల్లా రవాణా అధికారి (DTO) ఎమ్. వెంకన్న ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించడంపై మాజీ మంత్రి హరీశ్​రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇసుక, బొగ్గు మాఫియాలకు అడ్డొస్తే లారీలతో తొక్కించి చంపిస్తారా అని ప్రశ్నించారు.

భూపాలపల్లి డీటీఓ వెంకన్న ప్రమాదం వెనుక దాగిన నిజాన్ని వెలికితీయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అధికారులను బెదిరిస్తూ అక్రమ దందాలు సాగిస్తున్న ఇసుక మాఫియా, బొగ్గు మాఫియా వివరాలను బయటపెట్టాలని డిమాండ్​ చేశారు. ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. మరికొందరు కూడా ఈ ఘటనపై విరుచుకుపడ్డారు. ఇటు అధికారులు కూడా దీనిని తీవ్రంగా పరిగణిస్తున్నారు.

మరోవైపు  డీటీవో వెంకన్న మరణంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ ఘోర ఘటనపై సమగ్ర విచారణ జరిపించేందుకు ప్రభుత్వం తక్షణమే జీవో (G.O.Rt.No.346) జారీ చేసింది.

DTO Venkanna Death | బొగ్గు లారీ ఢీకొని ప్రమాదం:

ప్రభుత్వ నివేదిక ప్రకారం.. సోమవారం (22.06.2026) ఉదయం సుమారు 09:30 గంటల ప్రాంతంలో భూపాలపల్లి జిల్లా చేల్పూర్ పరిధిలోని ఆర్‌టీఓ (RTO) కార్యాలయం సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

డీటీఓ ఎమ్. వెంకన్న రోడ్డుపై తన అధికారిక విధులను (తనిఖీలు) నిర్వహిస్తుండగా, బొగ్గు లోడుతో వేగంగా వచ్చిన ఒక లారీ ఆయనపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఒక ఉన్నతాధికారి విధి నిర్వహణలో ఉండగా ప్రాణాలు కోల్పోవడంపై ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

DTO Venkanna Death | విచారణాధికారిగా చంద్రశేఖర్ గౌడ్ నియామకం:

ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి, ప్రమాదానికి గల కారణాలను, వాస్తవాలను నిర్ధారించడానికి జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ (RSC) ఎమ్. చంద్రశేఖర్ గౌడ్‌ను విచారణ అధికారిగా (Enquiry Officer) ప్రభుత్వం నియమించింది. ఆయన ఈ ఘటనపై సమగ్ర నివేదికను రవాణా కమిషనర్ ద్వారా ప్రభుత్వానికి వీలైనంత త్వరగా సమర్పించాల్సి ఉంటుంది.

DTO Venkanna Death | భద్రతా చర్యలపై ప్రత్యేక దృష్టి:

భవిష్యత్తులో ఇలాంటి విచారకరమైన ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. బహిరంగ రోడ్లపై వాహనాలను అడ్డుకునేటప్పుడు (Vehicle Interception), సీజ్ చేసేటప్పుడు క్షేత్రస్థాయి ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు, సిబ్బంది తీసుకోవాల్సిన భద్రతా ప్రోటోకాల్స్, అవసరమైన రక్షణ పరికరాలు, నూతన ప్రామాణిక కార్యాచరణ విధానాలపై (SOP) తగిన సూచనలు, సిఫార్సులను నివేదికలో చేర్చాలని విచారణ అధికారిని ఆదేశించింది.

ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తూ, తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా రవాణా కమిషనర్‌ను ఆదేశించారు.

Bhupalpally DTO Death | వాహనాలు తనిఖీ చేస్తుండగా దూసుకొచ్చిన బొగ్గు టిప్పర్​.. డీటీవో మృతి

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *