అక్షరటుడే, హైదరాబాద్: RTC Strike Loss | రాష్ట్రవ్యాప్త ఆర్టీసీ సమ్మె (RTC Strike) కారణంగా సంస్థ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది. సమ్మె కారణంగా నిన్న ఒక్కరోజే ఆర్టీసీకి రూ. 17 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. సాధారణ రోజుల్లో కోట్లల్లో వచ్చే ఆదాయం, సమ్మె ప్రభావంతో లక్షలకు పడిపోయింది.
RTC Strike Loss | కోలుకోలేని దెబ్బ ..
సాధారణంగా రాష్ట్రవ్యాప్తంగా టిక్కెట్ల విక్రయాల ద్వారా వచ్చే ఆదాయంతో పోలిస్తే, నిన్న కేవలం రూ. 3.22 కోట్లు మాత్రమే వసూలైనట్లు అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా వరంగల్ వంటి పెద్ద రీజియన్లలో ప్రతిరోజూ రూ.2 కోట్లకు పైగా ఆదాయం రావాల్సి ఉండగా, నిన్నటి వసూళ్లు కేవలం కొన్ని లక్షలకే పరిమితమయ్యాయి. ఆదాయం రాకపోగా, నిర్వహణ ఖర్చులు భారం కావడంతో సంస్థకు కోలుకోలేని దెబ్బ తగిలింది.
RTC Strike Loss | అద్దె బస్సులు సరిపోలేదు:
ఆర్టీసీకి చెందిన మొత్తం 9,000 పైన బస్సుల్లో సుమారు 6,500 సొంత బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రయాణికుల ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం 1,100 అద్దె బస్సులను నడిపినప్పటికీ, అవి ఏమాత్రం సరిపోలేదు. బస్టాండ్‌లలో ప్రయాణికులు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
RTC Strike Loss | ఆందోళనల కారణంగా 34 బస్సులు ధ్వంసం:
సమ్మె ఉద్రిక్తతల మధ్య వివిధ చోట్ల జరిగిన ప్రమాదాలు, ఆందోళనల కారణంగా 34 బస్సులు ధ్వంసమయ్యాయని అధికారులు తెలిపారు. ఒకవైపు ఆదాయం లేక, మరోవైపు ఉన్న వాహనాలు దెబ్బతినడంతో ఆర్టీసీ యాజమాన్యం (RTC Management) తీవ్ర ఆందోళన చెందుతోంది. కార్మికులు తమ పట్టు వీడకపోవడంతో మున్ముందు ఈ నష్టాలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.
ఇది కూడా చదవండి..: Biryani Center Seized | బిర్యానీ సెంటర్ను సీజ్ చేసిన అధికారులు

