Tirumala Heavy Rush | తిరుమలలో అనూహ్యంగా పెరిగిన రద్దీ.. వీఐపీ బ్రేక్, శ్రీవాణి దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం!

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tirumala Heavy Rush | తిరుమలలో శనివారం అనూహ్యంగా భారీ సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో సాధారణ భక్తులకు వీలైనంత త్వరగా శ్రీవారి దర్శనం కల్పించడంతో పాటు వారి భద్రత, సౌకర్యాలకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తూ టీటీడీ యంత్రాంగం నిరంతరం సేవలందిస్తోందని టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి తెలిపారు. శనివారం రాత్రి ఆయన పాచికాల్వ గంగమ్మ గుడి సర్కిల్‌ వద్ద క్యూ లైన్లను పర్యవేక్షించారు.

Theertha Snanam | దేవాలయ పుష్కరిణిలో స్నానం ఎందుకు చేయాలి? దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఇదే!

Tirumala Heavy Rush | లక్షన్నరకు పైగా..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తిరుమలలో సాధారణ రోజుల్లో సైతం రోజుకు సగటున 85 వేల నుంచి 87 వేల మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తున్నామని, ఇందుకోసం టీటీడీ అధికారులు, ఉద్యోగులు, విజిలెన్స్‌, పోలీసులు, అన్నప్రసాద విభాగం, పారిశుద్ధ్య సిబ్బంది తదితరులు రాత్రింబవళ్లు కృషి చేస్తున్నారని తెలిపారు.

అయితే శనివారం తిరుమల చరిత్రలోనే అరుదుగా కనిపించే స్థాయిలో లక్షన్నర మందికి పైగా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్న పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఇంత భారీ సంఖ్యలో భక్తులు ఒకేసారి రావడంతో అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తూ, భక్తులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ, క్యూ లైన్లలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు.

TTD

Tirumala Heavy Rush | సోమవారం అవి రద్దు..

ఆదివారం కూడా భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున పరిస్థితిని పూర్తిస్థాయిలో అదుపులో ఉంచేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా అధికారులు, సిబ్బంది సెలవులను రద్దు చేసి అందరినీ తిరుమలలోనే విధుల్లో కొనసాగిస్తున్నామని, అదనపు పోలీసు బలగాలను కూడా మోహరించినట్లు పేర్కొన్నారు.

సాధారణ భక్తులకు ఎక్కువ సమయం కేటాయించేందుకు సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఆన్ లైన్ లో ఏరోజుకారోజు కరెంట్ బుకింగ్ లో జారీ చేసే 800 శ్రీవాణి దర్శన టికెట్ల కోటాను రద్దు చేసినట్లు అదనపు ఈవో తెలిపారు. అలాగే ఎస్‌ఎస్‌డీ తదితర దర్శనాల కోటాలను కూడా అవసరానికి అనుగుణంగా తగ్గించి, ఆ సమయాన్ని సర్వదర్శనం భక్తులకు వినియోగిస్తున్నామని వివరించారు.

Tirumala Heavy Rush | నిరంతరాయంగా సేవలు..

తిరుమలలోని అన్ని యాత్రికుల వసతి సముదాయాలు, క్యూ లైన్లు పూర్తిగా నిండిపోయినప్పటికీ పారిశుద్ధ్యం, తాగునీరు, అన్నప్రసాదం, ఇతర మౌలిక సేవలను నిరంతరాయంగా అందిస్తున్నామని తెలిపారు.

భక్తులు టీటీడీకి సహకరించాలని అదనపు ఈవో విజ్ఞప్తి చేశారు. దర్శనం సమయంలో అనవసరంగా ఎక్కువసేపు గర్భగుడి వద్ద నిల్చోకుండా, వెనుక వేచి ఉన్న భక్తులను దృష్టిలో ఉంచుకొని త్వరితగతిన దర్శనం పూర్తి చేసుకోవాలని కోరారు.

శ్రీవారి అనుగ్రహంతో అన్ని ఏర్పాట్లు సజావుగా కొనసాగుతున్నాయని, సాధారణ భక్తులకు మెరుగైన సేవలు అందించడమే టీటీడీ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *