అక్షరటుడే, వెబ్‌డెస్క్: Telangana RDO Tahsildar offices | తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అద్దె భవనాల్లో మరియు శిథిలావస్థకు చేరిన భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ కార్యాలయాలకు శాశ్వత విముక్తి కలగనుంది.
రాష్ట్రంలో కొత్తగా 10 ఆర్డీఓ (RDO) కార్యాలయాలు, 107 తాసిల్దార్ (Tahsildar) కార్యాలయ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం పరిపాలనా అనుమతులు (Administrative Sanction) మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్మాణాల కోసం మొత్తం రూ. 263.25 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించింది.
ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రభుత్వ కార్యదర్శి లోకేష్ కుమార్ డి.ఎస్. జీవో ఆర్టీ నెంబర్ 375 (G.O.Rt.No.375) ద్వారా అధికారిక ఉత్తర్వులను విడుదల చేశారు.
Telangana RDO Tahsildar offices | ఒక్కో భవనానికి రూ. 2.25 కోట్లు
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. ప్రతి ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణానికి రూ. 2.25 కోట్ల చొప్పున ఖర్చు చేయనున్నారు. ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ (CCLA) సమర్పించిన నివేదికల ఆధారంగా ప్రభుత్వం ఈ నిధులను మంజూరు చేసింది. ఈ భవనాల నిర్మాణ బాధ్యతలను “తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్, హైదరాబాద్” సంస్థకు అప్పగించారు.
Telangana RDO Tahsildar offices | ఆర్థిక శాఖ సమర్పించిన నివేదిక
ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. కొత్త భవనాల నిర్మాణంతో ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ కావడంతో పాటు అధికారులకు, సిబ్బందికి మెరుగైన వసతులు లభించనున్నాయి.