భారతదేశ క్రీడా రంగాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో, దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఒకటైన యాక్సిస్ బ్యాంక్ , గోస్పోర్ట్స్ ఫౌండేషన్ చేతులు కలిపాయి. స్పోర్ట్స్ సైన్స్, పరిశోధన , అథ్లెట్ల సామర్థ్య పెంపుదలను సమగ్రంగా అనుసంధానిస్తూ, ‘ది పర్ఫార్మెన్స్ ఇన్స్టిట్యూట్’ (AGTPI)ను ఏర్పాటు చేసేందుకు ఈ రెండు సంస్థలు ఒక అవగాహన ఒప్పందం (ఎంవోయూ) పై సంతకం చేశాయి. క్రీడల దీర్ఘకాలిక వృద్ధికి తోడ్పడే పరిశోధనలు , ఆవిష్కరణలను ప్రోత్సహించే దిశగా దేశంలో ఇలాంటి వినూత్న ప్రయత్నం జరగడం ఇదే మొదటిసారి.
బెంగళూరులోని అత్యాధునిక ‘సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్’ (CSE) లో ఈ AGTPI ఇన్స్టిట్యూట్ కొలువుదీరనుంది. అథ్లెట్ల ప్రతిభను గుర్తించడం, స్పోర్ట్స్ సైన్స్ , మెడిసిన్ రంగాలలో భారతదేశ సామర్థ్యాన్ని పెంపొందించడం, , భారతీయ అథ్లెట్లపై ప్రత్యేక పరిశోధనలు చేయడం ఈ సంస్థ ప్రధాన ఉద్దేశ్యం. ఈ ప్రాజెక్టులో యాక్సిస్ బ్యాంక్ వ్యవస్థాపక భాగస్వామిగా తన సీఎస్ఆర్ (CSR) నిధులను సమకూరుస్తుండగా, గోస్పోర్ట్స్ ఫౌండేషన్ దీని పరిపాలన , వ్యూహాత్మక అమలును పర్యవేక్షిస్తుంది.
AGTPI మూడు ప్రధాన స్తంభాలు:
పీపుల్ (ప్రజలు/సిబ్బంది): శిక్షణ కార్యక్రమాలు, ఫెలోషిప్‌లు , మెంటార్షిప్ ద్వారా స్పోర్ట్స్ సైన్స్ నిపుణులను తయారు చేయడం. క్రీడా సమాఖ్యలు , అకాడమీలలో ఉన్న నిపుణుల కొరతను ఇది తీరుస్తుంది.
అనలిటిక్స్ (విశ్లేషణలు): అథ్లెట్ల పర్ఫార్మెన్స్ టెస్టింగ్, బయోమెకానిక్స్ విశ్లేషణ, గాయాల ముప్పు అంచనా , డేటా ఆధారిత ప్రదర్శన ప్రణాళికలను అందించే ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు.
రీసెర్చ్ (పరిశోధన): అప్లైడ్ రీసెర్చ్, ఆవిష్కరణలు , విజ్ఞాన మార్పిడి ద్వారా దేశీయ పరిస్థితులకు తగిన క్రీడా విజ్ఞానాన్ని పెంపొందించడం దీని లక్ష్యం.
“భారతదేశ క్రీడా ఆకాంక్షలు కీలక దశలో ఉన్నాయి. కేవలం ప్రతిభ, శిక్షణ సరిపోవు; మనకు బలమైన స్పోర్ట్స్ సైన్స్ పునాది అవసరం. విదేశీ ప్రమాణాల డేటాపై కాకుండా, మన అథ్లెట్ల అవసరాలకు సరిపోయే బలమైన వ్యవస్థను నిర్మించడంలో గోస్పోర్ట్స్ ఫౌండేషన్‌తో భాగస్వామి కావడం గర్వకారణం” అని యాక్సిస్ బ్యాంక్ గ్రూప్ హెడ్ విజయ్ ముల్బాగల్ తెలిపారు.
గోస్పోర్ట్స్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ నందన్ కామత్ స్పందిస్తూ, “గొప్ప క్రీడాకారులు గొప్ప వ్యవస్థల నుండే వస్తారు. భారతీయ క్రీడలకు బలమైన భవిష్యత్తును నిర్మించడమే మా లక్ష్యం” అని పేర్కొన్నారు. గోస్పోర్ట్స్ ఫౌండేషన్ సీఈఓ సౌగతో బెనర్జీ , సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ వ్యవస్థాపకుడు వివేక్ కుమార్ కూడా ఈ ఇన్స్టిట్యూట్ వల్ల భారతీయ క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయి సామర్థ్యాలు అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. దీర్ఘకాలిక సంస్థాగత మద్దతుతో కూడిన ఈ భాగస్వామ్యం, భవిష్యత్తులో భారతీయ అథ్లెట్ల కీర్తిని దశదిశలా చాటడానికి బలమైన పునాది వేయనుంది.