AI Heart Signal | గుండెపోటును ముందే పసిగట్టే ఏఐ.. శాస్త్రవేత్తల కీలక పరిశోధన

ఆరోగ్యంగా కనిపిస్తున్న వ్యక్తులు కూడా ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోవడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకరంగా మారింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: AI Heart Signal | ఆరోగ్యంగా కనిపిస్తున్న వ్యక్తులు కూడా ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోవడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకరంగా మారింది. ముఖ్యంగా కరోనా తర్వాత ‘సడన్ కార్డియాక్ డెత్’ (Sudden Cardiac Death) కేసులు పెరగడం వైద్య రంగానికి పెద్ద సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో, కృత్రిమ మేధస్సు (AI) ద్వారా భవిష్యత్తులో వచ్చే ముప్పును ముందుగానే గుర్తించే కీలకమైన ‘హార్ట్ సిగ్నల్’ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

AI Heart Signal | దశాబ్ద కాలం పరిశోధన ..

అమెరికాలోని ‘యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్క్లే’ పరిశోధకులు ఈ దిశగా పదేళ్ల పాటు శ్రమించారు. అసోసియేట్ ప్రొఫెసర్ జియాద్ ఒబెర్మేయర్ నేతృత్వంలోని బృందం ఏకంగా 4,40,000 ఈసీజీ (ECG) రేఖాచిత్రాలను, మరణ ధృవీకరణ పత్రాలను అనుసంధానించి ఏఐ మోడల్‌ను సిద్ధం చేశారు. అమెరికా, తైవాన్‌కు చెందిన రోగుల డేటాతో దీనిని నిర్ధారించారు. సాధారణ వైద్య పరీక్షలకు దొరకని సరికొత్త ‘వేవ్‌ఫార్మ్ ప్యాటర్న్‌’ను ఈ ఏఐ గుర్తించింది. ఇది వైద్య శాస్త్రానికి తెలియని ఒక సరికొత్త ‘బయోలాజికల్ క్లూ’ అని పరిశోధకులు వెల్లడించారు.

AI Heart Signal | ప్రస్తుత పద్ధతులతో పోలిస్తే ఎంతో మేలు..

ప్రస్తుతం వైద్యులు గుండె పంపింగ్ సామర్థ్యం (LVEF) ఆధారంగా గుండెపోటు ముప్పును అంచనా వేస్తున్నారు. కానీ, సాధారణ LVEF ఉన్నవారిలో కూడా ఆకస్మిక మరణాలు సంభవిస్తున్నట్లు మనం చూస్తున్నాం. సంప్రదాయ పద్ధతులతో పోలిస్తే, ఏఐ విధానం సుమారు 86 శాతం మంది ప్రమాదంలో ఉన్నవారిని అదనంగా గుర్తించగలుగుతోంది. సాధారణ పరీక్షల్లో అంతా ‘నార్మల్’గా ఉన్నా, భవిష్యత్తులో రాబోయే ముప్పును ఏఐ ముందే అంచనా వేయగలదని పరిశోధకులు చెబుతున్నారు.

AI Heart Signal | చికిత్సలో కీలక పాత్ర..

గుండె లయ తప్పి మరణించే వారిని కాపాడేందుకు ఇప్పటికే ‘ఇంప్లాంటబుల్ డిఫిబ్రిలేటర్లు’ (ICD) అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ పరికరాలు ఎవరికి అవసరమో ముందుగా గుర్తించడం వైద్యులకు సవాలుగా ఉండేది. ఇప్పుడు ఏఐ సాయంతో ఆ ప్రమాద హెచ్చరికలను ముందే గ్రహించడం వల్ల, సకాలంలో చికిత్స అందించి, ఎంతో మందిని మృత్యుముఖం నుంచి కాపాడే అవకాశం మెరుగుపడుతుందని పరిశోధకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సాంకేతికత భవిష్యత్తులో గుండె సంబంధిత ఆకస్మిక మరణాలను నివారించడంలో ఒక మైలురాయిగా నిలుస్తుందని వైద్య నిపుణులు భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి:  Voter Enumeration Form | ఎన్యూమరేషన్ ఫారాలను గడువులోపు అందించాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *