అక్షరటుడే, ఇందూరు: Voter Enumeration Form | ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)లో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాన్ని పూరించి గడువులోపు బూత్ లెవెల్ అధికారికి అందించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) సూచించారు. సోమవారం ప్రజావాణి అనంతరం కలెక్టర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
Voter Enumeration Form | ఈనెల 24వ తేదీలోపు..
అన్ని శాఖల జిల్లా అధికారులు, ఉద్యోగులందరూ విధిగా ఈనెల 24వ తేదీ లోపు ఎన్యూమరేషన్ ఫారంను నింపి బీఎల్వోలకు అందించాలని కలెక్టర్ సూచించారు. లేని పక్షంలో ఆగస్టు 5న ప్రచురించే ఓటర్ల ముసాయిదా జాబితాలో పేరు కోల్పోతారని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తేలికగా తీసుకోకూడదని, అధికారులు ఎంత పెద్ద హోదాలో, ఏ స్థాయిలో ఉన్నా ఎన్నికల సంఘం నిర్దేశించిన మేరకు ఎన్యూమరేషన్ ఫారం అందించాల్సిందేనన్నారు. జిల్లాలో దాదాపుగా అన్ని ప్రాంతాలలో ఇప్పటికే ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియ పూర్తయ్యిందని తెలిపారు. అయితే తీసుకున్న ఎన్యూమరేషన్ ఫారాలను తగిన వివరాలతో పూరించి, బీఎల్వోలకు గడువు లోపు అందించడం ఎంతో ముఖ్యమన్నారు. ఈ మేరకు ఓటర్లకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని, వివిధ శాఖల జిల్లా అధికారులకు, మండల స్పెషల్ ఆఫీసర్లు అవకాశం మేరకు తహశీల్దార్ కార్యాలయాలను సందర్శించాలని సూచించారు. కలెక్టరేట్లో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేయాలని ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజ్‌ను ఆదేశించారు.
Voter Enumeration Form | వసతిగృహాలను సందర్శించాలి
సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్లను క్రమం తప్పకుండా సందర్శించాలని మండల ప్రత్యేక అధికారులను కలెక్టర్ ఆదేశించారు. విద్యాసంస్థలను మొక్కుబడిగా సందర్శించకుండా, వాటి పనితీరును నిశితంగా పరిశీలించాలని, ఏమైనా సమస్యలు ఉన్నాయా అన్నది గమనించాలన్నారు. అధికారుల సందర్శనతో విద్యా సంస్థల పనితీరులో స్పష్టమైన మార్పు కనిపించాలన్నారు. ఓపెన్ బావులు వంటి ప్రమాదకర పరిస్థితులు నెలకొని ఉంటే వెంటనే తమ దృష్టికి తేవాలన్నారు. విద్యార్థులు పాముకాటు, విష కీటకాల బారిన పడకుండా అన్నివిద్యా సంస్థల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అంకిత భావంతో ఉత్తమ స్థాయిలో విధులు నిర్వర్తించే మండల స్పెషల్ ఆఫీసర్ ను ఎంపిక చేసి తగిన ప్రోత్సాహకం అందజేస్తామని కలెక్టర్ తెలిపారు. సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ వి.భుజంగరావు, ట్రెయినీ కలెక్టర్ సురేష్, డీఆర్వో గీత, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, డీఆర్డీవో సాయన్న, డీపీవో శ్రీనివాస్ రావు, నిజామాబాద్ ఏసీపీ ప్రకాశ్, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Cyber Crime Relief | జీఆర్ఎం, ఎంఆర్ఎంతో సైబర్ బాధితులకు ఉపశమనం: ఎస్పీ రాజేష్ చంద్ర