అక్షరటుడే వెబ్‌డెస్క్: Tonsils Surgery | చిన్న వయసులో పిల్లల శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా రక్షించడానికి గొంతులోని టాన్సిల్స్, ముక్కు వెనుక ఉండే అడినాయిడ్స్ గ్రంథులు ( Adenoids )ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే, కొన్ని సందర్భాల్లో ఇవి పదే పదే ఇన్ఫెక్షన్లకు గురై వాపు వస్తుంటాయి. దీనివల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుంది. పరిస్థితి తీవ్రమైనప్పుడు వీటిని సర్జరీ ద్వారా తొలగించాలని డాక్టర్లు సలహా ఇస్తుంటారు. అయితే, వీటిని తీసేస్తే పిల్లల్లో ఇమ్యూనిటీ తగ్గిపోతుందేమోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతుంటారు. ఈ విషయాలపై ఈఎన్టీ వైద్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
Tonsils Surgery | లక్షణాలను ఎలా గుర్తించాలి?
పిల్లల్లో ఈ సమస్య పెరిగినప్పుడు కొన్ని స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి. ముఖ్యంగా రాత్రి పూట పడుకున్నప్పుడు విపరీతంగా గురక పెట్టడం, ముక్కుతో గాలి పీల్చలేక నోరు తెరిచి శ్వాస తీసుకోవడం వంటివి చేస్తుంటారు. దీనితో పాటు తరచూ తీవ్రమైన గొంతునొప్పి రావడం, వినికిడి లోపం లేదా చెవిలో విపరీతమైన నొప్పి రావడం వంటి లక్షణాలు కనిపిస్తే గొంతు, ముక్కు గ్రంథులలో వాపు ఉందని అనుమానించాలి. ఇన్ఫెక్షన్ల తీవ్రత ఎక్కువై ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆపరేషన్ చేయడం వల్ల పిల్లలకు ఎంతో మేలు జరుగుతుంది. దీనివల్ల పదే పదే వచ్చే గొంతు ఇన్ఫెక్షన్లు పూర్తిగా తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు.
Tonsils Surgery | తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
చిన్నపాటి గొంతు నొప్పి ఉన్న ప్రతి ఒక్కరికీ ఆపరేషన్ అవసరం లేదంటున్నారు నిపుణులు. అయితే ఏ సర్జరీలోనైనా ఉండే చిన్నపాటి రిస్కులు ఇందులోనూ ఉంటాయి. ఆపరేషన్ జరిగిన కొత్తలో కొద్ది రోజుల పాటు గొంతు నొప్పి ఉండటం వల్ల పిల్లలు ఆహారం సరిగ్గా తీసుకోలేరు. దీనివల్ల బాడీలో నీటి శాతం తగ్గే (డీహైడ్రేషన్) అవకాశం ఉంది. సాధారణంగా పిల్లలు ఒకటి నుండి రెండు వారాల్లో దీని నుంచి పూర్తిగా కోలుకుంటారు. ఈ సమయంలో వారికి మంచి విశ్రాంతితో పాటు ఎక్కువగా ద్రవ పదార్థాలు (లిక్విడ్స్) ఇవ్వాలని వైద్యులు సూచిస్తున్నారు.
Tonsils Surgery | ఈ ఆపరేషన్ ఎప్పుడు అవసరం?
పిల్లలకు ఒక సంవత్సరంలో ఏడు సార్లకు పైగా, లేదా వరుసగా రెండేళ్లపాటు ఏడాదికి ఐదు సార్ల కంటే ఎక్కువగా తీవ్రమైన గొంతు ఇన్ఫెక్షన్లు వస్తేనే డాక్టర్లు సర్జరీని రికమండ్ చేస్తారు. సమస్య తీవ్రత ఎంతవరకు ఉంది, అది పిల్లల రోజువారీ జీవితాన్ని ఎంతవరకు ఇబ్బంది పెడుతోంది అనే విషయాల ఆధారంగానే ఒక మంచి ఈఎన్టీ స్పెషలిస్ట్‌ను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలి.
Tonsils Surgery | తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయాలు..
టాన్సిల్స్ లేదా అడినాయిడ్స్ తొలగించడం వల్ల పిల్లల రోగనిరోధక శక్తి బలహీనపడుతుందని తల్లిదండ్రులు అస్సలు భయపడాల్సిన పనిలేదు. ఎందుకంటే శరీరంలోని ఇతర రోగనిరోధక వ్యవస్థలు ఇన్ఫెక్షన్లపై పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటాయి. సర్జరీ పూర్తయ్యాక మొదటి కొన్ని రోజులు వేడి, కారంగా ఉండే వస్తువులను ఇవ్వకూడదు. ఐస్ క్రీములు, చల్లని పాలు, జ్యూసులు, పెరుగు అన్నం లాంటి మెత్తని ఆహారాలు ఇస్తే గొంతు నొప్పి తగ్గి పిల్లలకు ఎంతో ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: ACB Raid Mahabubnagar | ఏసీబీకి చిక్కిన సర్వే, ల్యాండ్ రికార్డ్స్ సూపరింటెండెంట్