LIC Premium Payment | LIC కీలక నిర్ణయం.. ఇకపై క్రెడిట్ కార్డ్‌తో పేమెంట్స్ బంద్!

ప్రముఖ ప్రభుత్వరంగ బీమా సంస్థ 'లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా' (LIC) తమ పాలసీదారులకు ఊహించని షాక్ ఇచ్చింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: LIC Premium Payment | ప్రముఖ ప్రభుత్వరంగ బీమా సంస్థ ‘లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా’ (LIC) తమ పాలసీదారులకు ఊహించని షాక్ ఇచ్చింది. ఇప్పటివరకు తమ అధికారిక కస్టమర్ పోర్టల్ , మొబైల్ యాప్‌లో అందుబాటులో ఉన్న ‘క్రెడిట్ కార్డ్’ ద్వారా ప్రీమియం చెల్లించే సదుపాయాన్ని సంస్థ పూర్తిగా నిలిపివేసింది. గత 15 రోజుల క్రితమే ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా ఈ నిర్ణయం అమలులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎల్‌ఐసీ అధికారిక వేదికలపై కేవలం నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, యూపీఐ (UPI) ఆప్షన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

LIC Premium Payment | ఈ నిర్ణయం ఎందుకు?

సాధారణంగా గూగుల్ పే, ఫోన్ పే వంటి థర్డ్ పార్టీ ప్లాట్‌ఫామ్‌లలో క్రెడిట్ కార్డుతో ఎల్‌ఐసీ ప్రీమియం చెల్లిస్తే కస్టమర్లపై అదనపు రుసుములు (Transaction Fees) పడేవి. కానీ, ఎల్‌ఐసీ అధికారిక యాప్‌లో క్రెడిట్ కార్డుతో చెల్లించినప్పుడు ఆ కార్డ్ గేట్‌వే ఛార్జీలను వినియోగదారుల తరఫున ఎల్‌ఐసీనే భరించేది. అయితే, ఇటీవలి కాలంలో క్రెడిట్ కార్డుల ద్వారా ప్రీమియం చెల్లించే వారి సంఖ్య భారీగా పెరిగింది. దీనివల్ల బ్యాంకులు , పేమెంట్ గేట్‌వేలకు ఎల్‌ఐసీ చెల్లించాల్సిన ఫీజుల భారం కోట్లాది రూపాయలకు చేరింది. ఈ అదనపు ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికే ఎల్‌ఐసీ తన పోర్టల్ నుండి క్రెడిట్ కార్డ్ చెల్లింపుల ఆప్షన్‌ను శాశ్వతంగా తొలగించినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

LIC Premium Payment

LIC Premium Payment | చెల్లింపులు ఎలా చేసుకోవాలి?

ఒకవేళ మీరు తప్పనిసరిగా క్రెడిట్ కార్డు ద్వారానే ఎల్‌ఐసీ ప్రీమియం చెల్లించాలనుకుంటే, గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, అమెజాన్ పే వంటి థర్డ్ పార్టీ యాప్స్‌ను ఉపయోగించుకోవచ్చు. అయితే, ఈ పద్ధతిలో చెల్లింపులు చేసేటప్పుడు ఆయా యాప్స్ విధించే అదనపు ట్రాన్సాక్షన్ లేదా కన్వీనియన్స్ ఫీజులను వినియోగదారులే సొంతంగా భరించాల్సి ఉంటుంది. ఒకవేళ ఎటువంటి అదనపు రుసుములు లేకుండా, ఉచితంగా ప్రీమియం చెల్లించాలనుకునే వారు మాత్రం ఎల్‌ఐసీ అధికారిక యాప్‌లో అందుబాటులో ఉన్న యూపీఐ (UPI), డెబిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ వంటి మార్గాలను ఎంచుకోవడం ఉత్తమం.

LIC Premium Payment | కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ యూజర్ల అసంతృప్తి..

యాక్సిస్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ వంటి సంస్థలతో కలిసి ఎల్‌ఐసీ జారీ చేసిన కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులకు కూడా ఈ కొత్త నిబంధన వర్తిస్తుంది. ఇతర ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ప్రీమియం చెల్లించినప్పుడు రివార్డు పాయింట్లు లభించినప్పటికీ, గేట్‌వే ఛార్జీల భారం పడటంతో ఈ కో-బ్రాండెడ్ కార్డుల వల్ల అసలు ప్రయోజనం ఏముందని పాలసీదారులు సామాజిక మాధ్యమాల్లో పెదవి విరుస్తున్నారు.

ఇది కూడా చదవండి:  Kannepalli Pump House | బ్యారేజీల సమస్య వస్తే రాజీనామా చేస్తాం.. ప్రభుత్వానికి కౌశిక్ రెడ్డి ఛాలెంజ్

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *