అక్షరటుడే, నిజామాబాద్ క్రైం : Minor Driving | ‘అరేయ్ రాజు.. రోడ్డుపైకి వెళ్లి ఆయిల్ ప్యాకెట్ తీసుకొని రారా.. బైక్ తీసుకుని వెళ్లు..’ అంటూ ఓ తండ్రి తన పదో తరగతి చదివే కొడుకును బయటకు పంపించాడు.. ఓ షాప్ యజమాని తన వద్ద పనిచేస్తున్న మైనర్‌కు పని అప్పజెబుతూ.. బైక్ కీస్ చేతిలో పెట్టాడు. ఇలా జిల్లాలో మైనర్ డ్రైవింగ్‌ను పెద్దలే ప్రోత్సహిస్తున్నారు. తద్వారా ప్రమాదాలకు కారణమవుతున్నారు. దీనిపై రవాణాశాఖ (Transport Department) కఠిన చర్యలు చేపడుతోంది.
Minor Driving | నిజామాబాద్ జిల్లాలో..
జిల్లాలో (Nizamabad) మైనర్ డ్రైవింగ్‌పై పోలీసులు, ఆర్టీఏ అధికారులు కఠినచర్యలు తీసుకుంటున్నారు. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుపడితే తల్లిదండ్రులు లేదా వాహన యజమానులకు సంబంధించిన బైక్‌ల రిజిస్ట్రేషన్‌ను ఏడాది పాటు రద్దు చేస్తున్నారు. అయినప్పటికీ నిర్లక్ష్యం వహిస్తే క్రిమినల్ కేసు నమోదు చేసి జైలుకు పంపుతున్నారు.
రాష్ట్రంలోనే రెండోస్థానం..
మోటారు వాహనాల చట్టం, సుప్రీంకోర్టు నిబంధనలు పక్కాగా అమలు చేస్తున్న రవాణాశాఖ అధికారులు ఇటీవల దూకుడు పెంచారు. రాష్ట్రవ్యాప్తంగా మైనర్లు నడిపిన వాహనాల రిజిస్ట్రేషన్లు రద్దు చేస్తూ వెళ్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో అత్యధికంగా 3,523 వాహనాల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేశారు. రెండో స్థానంలో నిజామాబాద్ నిలవడం గమనార్హం. 2025 జూన్ నుంచి ఇప్పటివరకు జిల్లాలో 283 వాహనాల రిజిస్ట్రేషన్లు రద్దు చేశారు.
Minor Driving | ప్రమాదాలకు కారణం
కామారెడ్డి(kamareddy) మండలం ఇల్చిపూర్ శివారులో గతనెల 16ఏళ్ల మైనర్ నడిపిన బైక్ ఎదురుగా వస్తున్న మరో బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎదురుగా వస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మైనర్‌కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. నిజామాబాద్ జిల్లాలోనూ మైనర్ డ్రైవింగ్ ఘటనలు విపరీతంగా పెరిగిపోయాయి. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు వివిధ పనుల నిమిత్తం ఇంట్లో నుంచి బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా బైక్‌లను వినియోగిస్తున్నారు. మితిమీరిన వేగంతో వెళ్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. నగరంలోని ఆయా కాలనీల్లో నిత్యం ఏదోఒక చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. మోటారు వాహనాల చట్టం(Motor Vehicles Act), 1988లోని సెక్షన్ 199ఏ (2019 సవరణ) ప్రకారం ఒక మైనర్ వాహనాన్ని డ్రైవ్ చేస్తూ పట్టుబడితే ఆ వాహన యజమాని లేదా సంరక్షకుడిని నేరస్తుడిగా పరిగణిస్తారు. చట్ట ప్రకారం..వారే శిక్షార్హులవుతారు. జైలు శిక్ష సైతం విధించే అవకాశం ఉంటుంది.. అలాగే వాహనం రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తారు.
Minor Driving | వారి ముచ్చట తీర్చే మార్గం ఇదేనా..!
చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు అడగగానే బైక్‌లు కొనిస్తున్నారు. వారు మైనర్లని.. రోడ్లపైకి బైక్‌లతో వెళ్తే ఇబ్బందులు ఎదురవుతాయని తెలిసి కూడా ఇలాంటి చర్యలకు ఉపక్రమిస్తున్నారు. పిల్లలు అడిగిన తర్వాత కొనివ్వకపోతే ఏమవుతుందోననే నెపంతో వారికి బైక్‌లు అప్పజెప్పేస్తున్నారు. కొన్ని ఏరియాల్లో అమ్మాయిలు సైతం బైక్‌లపై వేగంగా వెళ్తూ కనిపిస్తున్నారు. బైక్ కొనివ్వమని వారు మారం చేస్తే సర్దిచెప్పి బాగా చదువుకున్నాక అన్ని ఇప్పిస్తామని చెప్పాల్సిన తల్లిదండ్రులే పిల్లలు ప్రమాదాలకు గురికావడానికి కారణమవుతున్నారు.
నిబంధనలు కఠినంగా అమలు చేస్తాం
– దుర్గా ప్రమీల, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్
మైనర్లు వాహనాలు నడిపిన కారణంగా గతేడాది జూన్ నుంచి ఇప్పటివరకు నిజామాబాద్ జిల్లా పరిధిలో 283 వాహనాల రిజిస్ట్రేషన్లు రద్దు చేశాం. మైనర్లు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరం. మైనర్లు ఎక్కడైనా బైక్‌లు, ఇతర వాహనాలు నడుపుతూ తనిఖీల్లో పట్టుబడితే ముందుగా సంబంధిత వాహనాల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తాం. వాహనాలు ఇచ్చిన యజమానులపై చర్యలు కూడా తప్పవు. మైనర్లు వాహనాలు నడపడం కారణంగా వారితో పాటు ఇతరుల ప్రాణాలకు సైతం ప్రమాదం పొంచిఉంది. కాబట్టి పెద్దలు పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దు. రవాణాశాఖ ఆధ్వర్యంలో నిత్యం తనిఖీలు జరుగుతూనే ఉంటాయి. చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం.
ఇది కూడాచదవండి: Chennai : ఆరోగ్య శాఖలో కొత్తగా నియమితులైన సిబ్బందికి నియామక పత్రాలను అందజేసిన తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్