అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: RTA Services | ఆర్టీఏ సేవలను ప్రజలకు సమర్థవంతంగా అందించాలని జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ పేర్కొన్నారు. నిజామాబాద్ (Nizamabad) పర్యటనలో భాగంగా బుధవారం ఆయన ఉమ్మడి జిల్లాల రవాణా శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
RTA Services | ఆర్టీఏ కార్యాలయాన్ని మొదట సందర్శించి..
జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ (IT, Vigilance & Road Safety) ఎం. చంద్రశేఖర్ గౌడ్ మొదట నిజామాబాద్ ఉప రవాణా కమిషనర్ కార్యాలయాన్ని సందర్శించారు. కార్యాలయంలోని వివిధ విభాగాల పనితీరును తనిఖీ చేశారు. అనంతరం నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాల రవాణా శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి, ఆయా కార్యాలయాల పనితీరు, ప్రజలకు అందిస్తున్న సేవలు, ఆదాయ వసూళ్లు, ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యకలాపాలపై సమగ్రంగా సమీక్షించారు.
RTA Services | కౌంటర్, క్లర్క్‌ల వారీగా పరిశీలన..
ఈ సందర్భంగా కౌంటర్ వారీగా, క్లర్క్ వారీగా నిర్వహిస్తున్న లావాదేవీలను చంద్రశేఖర్ గౌడ్ పరిశీలించారు. లెర్నర్ లైసెన్స్ (LLR), డ్రైవింగ్ లైసెన్స్ (DL), వాహనాల ఫిట్‌నెస్, రిజిస్ట్రేషన్ రెన్యువల్ విభాగాల పనితీరును సమీక్షించి, ప్రజలకు సేవలందించడంలో ఎలాంటి జాప్యం జరగకుండా చూడాలని సూచించారు. వాహన్ (VAHAN), సారథి (SARATHI), CFST పోర్టళ్లలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను సమీక్షించి, వాటిని నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. స్మార్ట్ కార్డుల ప్రింటింగ్ మరియు డిస్పాచ్ ప్రక్రియను పరిశీలించి, ప్రజలకు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
RTA Services | రెవెన్యూ వసూళ్లపై సమీక్ష..
ఇన్‌స్పెక్టర్ వారీగా రెవెన్యూ వసూళ్లను సమీక్షించి, ప్రభుత్వ ఆదాయ లక్ష్యాల సాధనకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆదేశించారు. పన్నులు చెల్లించని వాహనాలపై ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్‌లు నిర్వహించాలని, అధిక లోడుతో నడిచే వాహనాలపై తనిఖీలు ముమ్మరం చేసి, నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
RTA Services | అనధికార వ్యక్తుల ప్రవేశాలపై నిఘా..
అదేవిధంగా కార్యాలయ ప్రాంగణంలో అనధికార వ్యక్తులు, మధ్యవర్తుల ప్రవేశాన్ని పూర్తిగా నిరోధించాలని, కార్యాలయ కార్యకలాపాల్లో పారదర్శకత, క్రమశిక్షణ, జవాబుదారీతనాన్ని పాటించాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ శ్రీ ఎం. చంద్రశేఖర్ గౌడ్, ఉప రవాణా కమిషనర్ దుర్గ ప్రమీలతో కలిసి మొక్కలు నాటారు. పచ్చదనం పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా సూచించారు. ప్రజలకు రవాణా శాఖ సేవలను వేగవంతంగా, పారదర్శకంగా అందించడంతో పాటు పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం, ఆదాయ వసూళ్ల మెరుగుదల, రహదారి భద్రత, సమర్థవంతమైన ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని రెండు జిల్లాల అధికారులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో డీటీవో రమేష్ రాథోడ్, ఆర్టీవో సంతోష్ కుమార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రహ్లాద్, ఎంవీఐలు అశ్వంత్ కుమార్, రాహుల్, ప్రదీప్, ఏఎంవీఐ రోహిత్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: బీజేపీలోకి సూర్య కుమార్ యాదవ్..!