అక్షరటుడే వెబ్‌డెస్క్: Ponguleti Voter Deletion | ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన పీఏసీ సమావేశంలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఓట్ల తొలగింపు పేరుతో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కో ఇన్‌చార్జ్ సచిన్ సావంత్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ సమావేశంలో, స్థానిక పార్లమెంట్ సభ్యులు రఘురామ్ రెడ్డి, ఖమ్మం జిల్లా డీసీసీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్, వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Ponguleti Voter Deletion | ఓటర్ల తొలగింపుపై కుట్రలు..
రాష్ట్రంలో ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియను అడ్డుపెట్టుకుని, బీఆర్ఎస్‌తో కలిసి బీజేపీ ( BJP ) కుట్రలు పన్నుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉన్న దళిత, గిరిజన , మైనారిటీ వర్గాల ఓట్లను తొలగించేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు. దాదాపు 67 నుంచి 68 లక్షల ఓట్లను తొలగించడంతో పాటు, మరో 70 లక్షల ఓట్లను అనిశ్చితిలో ఉంచి ఓటర్లను గందరగోళానికి గురిచేస్తున్నారని విమర్శించారు. ఈ దుష్ప్రచారాలు , కుట్రలను తిప్పికొట్టే ఉద్దేశంతో, రాబోయే కొద్ది రోజుల్లో బూత్ స్థాయి కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.
Ponguleti Voter Deletion | అసత్య ప్రచారాలు..
రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమాన్ని పక్కనబెట్టి, ప్రతిపక్షాలు నెలకు రూ.4 నుంచి 5 కోట్లు ఖర్చు చేస్తూ సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నాయని, వాటిని శ్రేణులంతా సమర్థవంతంగా ఎదుర్కొవాలని పిలుపునిచ్చారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి అత్యధిక స్థానాలను గెలుచుకుని, రాహుల్ గాంధీని దేశ ప్రధానిని చేయడమే కాంగ్రెస్ శ్రేణుల ప్రధాన లక్ష్యమని పొంగులేటి స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Head Constable | హెడ్ కానిస్టేబుల్ తిరుపతి కుటుంబాన్ని ఆదుకుంటాం: సీపీ సాయిచైతన్య