అక్షరటుడే వెబ్‌డెస్క్:Fast Track Court Verdict | మహిళలు, బాలికలను బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెట్టిన కేసులో హైదరాబాద్‌లోని ( Hyderabad ) ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో మొత్తం 33 మంది నిందితులకు కోర్టు కఠిన శిక్షలు ఖరారు చేసింది. ప్రత్యేక న్యాయమూర్తి ఉడయ్ భాస్కర్ రావు బుధవారం ఈ తీర్పును ప్రకటించారు. సీఐడీ (CID) హైదరాబాద్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఈ కేసులో 9 మంది మైనర్ బాలికలతో సహా మొత్తం 38 మంది బాధితులు ఉండగా.. బాధితుల్లో ప్రతి ఒక్కరికీ రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.45 లక్షల పరిహారం చెల్లించాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ కేసులో కోర్టు విధించిన శిక్షల వివరాల ప్రకారం.. ఐదుగురు దోషులకు జీవిత ఖైదు, మరో ముగ్గురికి 14 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, 14 మందికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, అలాగే 11 మందికి మూడేళ్ల కఠిన కారాగార శిక్ష ఖరారైంది.
Fast Track Court Verdict | ఉద్యోగం పేరుతో మోసం..
వ్యవసాయ పనులు చేసుకునే ఓ బాధితురాలికి ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి, 2015 జులై 17న నిందితులు ఖమ్మం, బల్లార్షా ప్రాంతాలకు తీసుకెళ్లారు. అక్కడ ఆమెను బలవంతంగా వ్యభిచారంలోకి దించి, రోజుకు సుమారు 10 నుంచి 15 మంది కస్టమర్లతో లైంగిక సంబంధాలు పెట్టుకోవాలని తీవ్రంగా వేధించారు. నాలుగు నెలల పాటు నరకయాతన అనుభవించిన ఆ బాధితురాలు వారి చెర నుంచి తప్పించుకుని నేరుగా సీఐడీ అధికారులను ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
Fast Track Court Verdict | సీఐడీ దాడులు ..
బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సీఐడీ పోలీసులు వ్యభిచార గృహాలపై మెరుపు దాడులు చేశారు. ఈ ఆపరేషన్‌లో A1 నుంచి A45 వరకు ఉన్న నిందితులను అరెస్ట్ చేసి, 9 మంది మైనర్లతో సహా మొత్తం 38 మంది బాధితులను సురక్షితంగా రక్షించారు. ఈ కేసులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మారెళ్ల రమాదేవి పటిష్టమైన వాదనలు వినిపించారు. అలాగే డీఎస్పీలు సురేశ్ బాబు, కె. శ్రీనివాసరావు, ఇన్‌స్పెక్టర్లు కె. బలరామ్ రెడ్డి, ఎస్.ఏ.కె. జీలానీల దర్యాప్తు, కేస్ మానిటరింగ్ ఆఫీసర్ ఇన్‌స్పెక్టర్ కె. సత్యనారాయణ రెడ్డి, కోర్టు డ్యూటీ ఆఫీసర్ హెచ్‌సీ శాంతి శ్రీనివాస్ రెడ్డిల సమన్వయం, భరోసా లీగల్ కౌన్సెలర్ టి. కల్పన సేవలు నిందితులకు శిక్ష పడేలా చేయడంలో కీలకపాత్ర పోషించినట్లు పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Ponguleti Voter Deletion | బీజేపీ కుట్రలను తిప్పికొడతాం : మంత్రి పొంగులేటి