అక్షరటుడే, వెబ్డెస్క్: NEET Paper Leak | నీట్-యూజీ 2026 పరీక్షా పత్రం లీకేజీ వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు శివరాజ్ రఘునాథ్ మోటేగావ్కర్ బెయిల్ పిటిషన్ను వ్యతిరేకిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టుకు కీలక నివేదికను సమర్పించింది.
NEET Paper Leak | ఎలా జరిగింది లీకేజీ?
మహారాష్ట్ర (Maharashtra)లోని లాతూర్కు చెందిన శివరాజ్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రశ్నపత్రాల రూపకల్పన కమిటీలో సభ్యుడిగా ఉన్న పీవీ కులకర్ణి ద్వారా ప్రశ్నపత్రాలను సేకరించినట్లు దర్యాప్తులో తేలింది. కులకర్ణి కోచింగ్ సెంటర్లో శివరాజ్ కుమారుడు చదువుతుండటంతో, వారిద్దరి మధ్య ఉన్న పరిచయంతోనే ఈ లీకేజీకి పాల్పడినట్లు సీబీఐ గుర్తించింది.
NEET Paper Leak | సీబీఐ సేకరించిన ఆధారాలు..
శివరాజ్ ఫోన్ను ఫోరెన్సిక్ పరీక్ష చేయగా అందులో 36 ఫొటోలు లభించాయి. వాటిలో చేతితో రాసిన 132 రసాయన శాస్త్ర ప్రశ్నలు ఉన్నాయి. ఆ చేతిరాత నోట్స్లోని 111 ప్రశ్నలు, అసలైన నీట్ మాస్టర్ ప్రశ్నపత్రంతో సరిగ్గా సరిపోయాయి. నీట్ పరీక్ష జరగడానికి దాదాపు 10 రోజుల ముందే (ఏప్రిల్ 23న) ఈ ఫొటోలను నిందితుడు తీసినట్లు దర్యాప్తు సంస్థ ధ్రువీకరించింది. ఈ లీకేజీకి సంబంధించి రూ. 5 లక్షల వరకు లావాదేవీలు జరిగినట్లు ఆధారాలు లభించాయి.
NEET Paper Leak | ప్రస్తుత పరిస్థితి..
ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం 13 మందిని అరెస్టు చేశామని, వారందరూ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారని సీబీఐ స్పష్టం చేసింది. మే 3న జరిగిన పరీక్షలో అవకతవకలు జరగడంతో, పరీక్షను రద్దు చేసి ప్రభుత్వం జూన్ 21న మళ్లీ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు కూడా కేసు నమోదులో జాప్యంపై అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.
CBI: Latur coaching owner paid Rs 5 lakh for NEET questionshttps://t.co/tBxKTN933C
— The Siasat Daily (@TheSiasatDaily) July 16, 2026
ఇది కూడా చదవండి..: Fuel Export Tax | చమురు ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. డీజిల్, ఏటీఎఫ్ పన్ను పెంపు