అక్షరటుడే, కామారెడ్డి: Youth Suicide Case | ప్రేమించిన బాలిక తరపు వారి వేధింపులు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన దోమకొండ మండలం (Domakonda Mandal) చింతమాన్పల్లి గ్రామంలో చోటుచేసుకుంది.
Youth Suicide Case | చింతామాన్పల్లిలో..
పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రంగబోయిన సందీప్(23) ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలికతో ప్రేమలో పడ్డాడు. ఈ విషయంలో బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఏడాది క్రితం అతనిపై పోక్సో కేసు నమోదైంది. ఆ కేసులో సందీప్ జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. ఆ తర్వాత కూడా సందీప్ తమ కూతురికి ఫోన్ ద్వారా మెసేజ్లు పంపుతున్నాడని ఆరోపిస్తూ బాలిక తల్లిదండ్రులు అతడిని బెదిరించారు. ఇక నుంచి సంప్రదించవద్దని గట్టిగా హెచ్చరిస్తూ మెసేజ్లు కూడా పంపారు. ఈ అంశంపై బాలిక తల్లిదండ్రులు మరోసారి దోమకొండ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. ఎస్సై ఇరువర్గాలను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.
Youth Suicide Case | మనస్తాపానికి గురై..
ఈ పరిణామాలతో తీవ్ర మనస్తాపానికి గురైన సందీప్ గ్రామ శివారులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొందరు వ్యక్తుల బెదిరింపులు, వేధింపుల వల్లే తమ కుమారుడు ఈ నిర్ణయం తీసుకున్నాడని సందీప్ తల్లిదండ్రులు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమారుడి మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. సందీప్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని దోమకొండ ఎస్సై ప్రభాకర్ తెలిపారు.
ఇది కూడా చదవండి..: MeeSeva Irregularities | ‘మీసేవ’లలో అక్రమాలు.. రంగంలోకి దిగిన విజిలెన్స్ బృందాలు..