Corporate School Fees | కార్పొరేట్​ బడుల మాయాజాలం.. అడ్డగోలుగా ఫీజుల వసూలు

కార్పొరేట్ పాఠశాలలు విద్యార్థులకు గాలం వేస్తున్నాయి. రంగు రంగుల బ్రోచర్లు, పెద్ద పెద్ద భవనాలతో మాయాజాలం చేస్తున్నాయి.

Balla Sandeep Kumar

అక్షరటుడే, కామారెడ్డి : Corporate School Fees | కార్పొరేట్ పాఠశాలలు విద్యార్థులకు గాలం వేస్తున్నాయి. రంగు రంగుల బ్రోచర్లు, పెద్ద పెద్ద భవనాలతో మాయాజాలం చేస్తున్నాయి. స్మార్ట్ ఎడ్యుకేషన్, ఇంటర్నేషనల్ సిలబస్, బెస్ట్ ఫ్యూచర్ అని చెబుతూ.. తల్లిదండ్రులను మభ్య పెడుతున్నాయి. విద్యార్థుల నుంచి రూ.లక్షల చొప్పున ఫీజులు వసూలు చేస్తున్నాయి. దీంతో మధ్యతరగతి తల్లిదండ్రులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా (Nizamabad District)లో గత రెండేళ్లుగా కార్పొరేట్, ఇంటర్నేషనల్ పేరిట పాఠశాలలు పుట్టగొడుగుల్లా వెలిశాయి. డిజిటల్ క్లాస్ రూమ్స్, ఏసీ బస్సులు, కోడింగ్, రోబోటిక్స్ పేరుతో ప్రచారం చేస్తూ పాఠశాలల్లో అడ్మిషన్లు చేయిస్తున్నారు. సాధారణ ప్రైవేట్ పాఠశాలల్లో కంటే కార్పొరేట్, ఇంటర్నేషనల్గా చెప్పుకుంటున్న పాఠశాలల్లో ఫీజులు లక్షల్లో ఉంటున్నాయి. ఏడాదికి రూ.1.5 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. ఫీజు కట్టలేక తల్లిదండ్రులు అప్పుల పాలవుతున్నారు. ‘సీటు పోతుంది, మీ పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుంది’ అంటూ ఒత్తిడి తెస్తున్నారు. స్కాలర్‌షిప్, 50% డిస్కౌంట్ అంటూ మొదట్లో ఊరిస్తూ తీరా పాఠశాలలో చేరాక అదనపు ఫీజులు, యాక్టివిటీ ఛార్జీలు, బుక్స్, యూనిఫాం పేరుతో లక్షలు గుంజుతున్నారు.

Corporate School Fees | అనుమతులు లేకున్నా

ప్రభుత్వ నిబంధనల ప్రకారం సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ అనుబంధానికి విద్యాశాఖ నుంచి ఎన్​వోసీ తప్పనిసరి. కానీ జిల్లాలోని పలు ఇంటర్నేషనల్ స్కూళ్లకు పూర్తి స్థాయి అనుమతులు లేవని సమాచారం. మరికొన్ని స్కూళ్లు కేవలం ప్రాథమిక స్థాయికి అనుమతి తీసుకొని 10వ తరగతి వరకు నడుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఆటస్థలం, ఫైర్ సేఫ్టీ, ల్యాబ్ సౌకర్యాలు లేకున్నా ‘వరల్డ్ క్లాస్’ అని బోర్డులు పెట్టి మరీ పాఠశాలలు కొనసాగిస్తున్నారు.

Corporate School Fees | పట్టించుకోని విద్యాశాఖ అధికారులు

Corporate School Fees

ప్రతి ఏటా ఫీజుల నియంత్రణ, అనుమతుల తనిఖీ చేయాల్సిన విద్యాశాఖ అధికారులు మొక్కుబడిగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. ఫిర్యాదులు వచ్చినా ‘మెమో’ ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. ఇప్పటికి జిల్లాల్లో ఫీజు నియంత్రణ కమిటీలు ఏర్పాటు చేయలేదన్న ఆరోపణలున్నాయి. ఉన్నా వాటిలో పాఠశాలలకు అనుకూలంగా ఉన్నవారిని చేర్చి నామమాత్రపు సమావేశాలు నిర్వహిస్తున్నట్టుగా సమాచారం. దీంతో యాజమాన్యాలు మరింత రెచ్చిపోతున్నాయి.

ఇది కూడా చదవండి..: Kavitha Singareni Comments | తెలంగాణ ఇజ్జత్​ తీస్తున్న సీఎం.. కవిత సంచలన వ్యాఖ్యలు

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *