అక్షరటుడే, వెబ్డెస్క్: NEET Paper Leak | దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసిన నీట్ యూజీ ప్రశ్నపత్రం లీక్ కేసు దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసును విచారిస్తున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ CBI) కోర్టులో సమర్పించిన వివరాల ప్రకారం, మహారాష్ట్ర MAHARASHTRA లోని లాతూర్కు చెందిన ఓ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు పరీక్షకు ముందే కెమిస్ట్రీ ప్రశ్నలను పొందేందుకు రూ.5 లక్షలు చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
NEET Paper Leak | ఫొటోల రూపంలో ప్రశ్నలు..
దర్యాప్తు సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, ప్రశ్నపత్రాల రూపకల్పన ప్రక్రియతో సంబంధం ఉన్న వ్యక్తి ద్వారా ఈ ప్రశ్నలు అందినట్లు గుర్తించారు. కోచింగ్ సెంటర్ నిర్వాహకుడి కుమారుడు సంబంధిత వ్యక్తి నిర్వహించిన తరగతులకు హాజరవుతూ ఉండగా, ఆ సమయంలోనే ఈ ప్రశ్నలు అందినట్లు సీబీఐ కోర్టుకు వెల్లడించింది.
నిందితుడి మొబైల్ ఫోన్ను పరిశీలించగా 36 ఫొటోలు ప్రశ్నలకు సంబంధించినవే ఉన్నట్లు సమాచారం. కాగా ఇందులో కెమిస్ట్రీ ప్రశ్నలకు సంబంధించి 32 ఫొటోలు లభించినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు.
వాటిలో మొత్తం 132 ప్రశ్నలు ఉండగా, అందులో 111 ప్రశ్నలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించిన నీట్ యూజీ పరీక్ష మాస్టర్ ప్రశ్నపత్రంలోని ప్రశ్నలతో సరిపోలినట్లు సీబీఐ పేర్కొంది.
ఈ ఆధారాలు దర్యాప్తులో కీలకమైనవని, నిందితులను బెయిల్పై విడుదల చేస్తే విచారణపై ప్రభావం పడే అవకాశం ఉందని సీబీఐ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలో బెయిల్ మంజూరు చేయవద్దని కోర్టును కోరింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది.