Himalayan Snow Decline | నీటి గోపురాల్లో తగ్గుతున్న మంచు.. హిమాలయాలు కనుమరుగుకానున్నాయా!

Naresh Chandan
Himalayan Snow Decline

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Himalayan Snow Decline | ఆసియాకు ‘నీటి గోపురం’గా పేరొందిన హిమాలయ శిఖరాల్లో మంచు తగ్గిపోతున్నట్లు తాజా నివేదిక హెచ్చరించింది. ఆఫ్ఘానిస్తాన్ నుంచి మయన్మార్ వరకు విస్తరించిన హిందూ కుష్ పర్వత ప్రాంతాల్లో మంచు నిల్వలు గత రెండు దశాబ్దాల్లో గణనీయంగా పడిపోయాయని వెల్లడైంది. దీనివల్ల సుమారు రెండు బిలియన్ల మందిపై నీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కాఠ్మండూ కేంద్రంగా పనిచేస్తున్న International Centre for Integrated Mountain Development విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2025 నవంబర్ నుంచి 2026 మార్చి మధ్యకాలంలో మంచు నిల్వలు దీర్ఘకాల సగటుతో పోల్చితే..  27.8 శాతం తక్కువగా నమోదయ్యాయి. మంచు పడిన తర్వాత అది నేలపై ఎంతకాలం నిల్వ ఉంటుందో సూచించే ‘స్నో పర్సిస్టెన్స్’ సూచీ గణనీయంగా పడిపోవడం శాస్త్రవేత్తలను కలవరపెడుతోంది.

Himalayan Snow Decline | నీటి భద్రతకు కీలకం

హిమాలయ ప్రాంతంలోని సీజనల్ మంచు కేవలం అందమైన దృశ్యం మాత్రమే కాదు.. అది సహజ నీటి నిల్వగా పనిచేస్తుంది. ఈ మంచు కరగడం ద్వారా వచ్చే నీరు.. ఇక్కడి 12 ప్రధాన నదీ పరివాహక ప్రాంతాల్లో సుమారు పావు వంతు వార్షిక ప్రవాహాన్ని (రన్‌ఆఫ్) సమకూర్చుతుంది.

ఈ నదులు వ్యవసాయం, జల విద్యుత్తు ఉత్పత్తి, పట్టణాల తాగునీటి అవసరాలకు కీలకం. కాబూల్ నుంచి కోల్​కత్తా వరకు విస్తరించిన నగరాలు ఈ నీటి వనరులపై ఆధారపడి ఉన్నాయి.akshara today .jpg hima

Himalayan Snow Decline | నదీ పరివాహకాలపై ప్రభావం..

ఈ తగ్గుదల అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా లేదు. మెకాంగ్ నది పరివాహక ప్రాంతంలో 59.5 శాతం తగ్గుదల నమోదైంది. టిబెటన్ పీఠభూమిలో 47.4 శాతం లోటు ఉంది. యెల్లో రివర్, అము దర్యా పరివాహకాల్లోనూ గణనీయమైన తగ్గుదల నమోదైంది.

అయితే భారత్‌కు కొంత ఊరటనిచ్చే విషయం ఏమిటంటే, గంగా నది పరివాహక ప్రాంతంలో ఈ శీతాకాలంలో మంచు నిల్వలు సగటుతో పోల్చితే 16.3 శాతం అధికంగా నమోదయ్యాయి. ఇది ఉత్తర భారతంలోని కొన్ని ప్రాంతాలకు కాస్త ఉపశమనం కలిగించే విషయం.

Himalayan Snow Decline | దీర్ఘకాల ధోరణే..

ఈ పరిస్థితి ఒక్కసారిగా ఏర్పడింది కాదని నిపుణులు చెబుతున్నారు. వరుసగా నాలుగో ఏడాది కూడా సాధారణం కంటే తక్కువ మంచు నమోదైందని పేర్కొంటున్నారు. 2003 తర్వాత 14 శీతాకాలాల్లో ఇలాంటి లోటు కనిపించిందని నివేదిక వెల్లడిస్తోంది.

అదనంగా, హిమనదాలు 2000 సంవత్సరం ముందు కంటే రెండింతల వేగంతో కరుగుతున్నాయట. ఇది భవిష్యత్తులో ఎండాకాలాలు పొడిగా మారి, నీటి కొరత పెరిగే ప్రమాదాలను సూచిస్తోంది.

Himalayan Snow Decline | ముందస్తు చర్యలు అవసరం

ఈ నేపథ్యంలో ప్రభుత్వాలకు శాస్త్రవేత్తలు కీలక సూచనలు చేస్తున్నారు. ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను బలోపేతం చేయడం, సీజనల్‌గా నీటిని నిల్వ చేసుకోవడం, వ్యవసాయం, విద్యుత్తు రంగాల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడం అత్యవసరమని పేర్కొన్నారు.

సరైన ప్రణాళిక లేకపోతే ఎండాకాలంలో నదుల ప్రవాహం తగ్గిపోవడం, తాగునీటి కొరత పెరగడం, భూగర్భ జల వినియోగం మరింత పెరగడం వంటి సమస్యలు తీవ్రమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

Ashu Reddy Case | ప్రేమ పేరుతో రూ.9 కోట్లు మోసం.. అషురెడ్డిపై కేసు నమోదు

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *