అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Endowments Department Jobs | దేవాదాయ శాఖలో వివిధ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసింది. పురోహితులు, పరిచారకులు, వేదపండితులు, పురోహితులు (వాహన పూజ), అసిస్టెంట్ కుక్‌లు, డోలు, సన్నాయి, మృదంగం, శృతి, తాళం తదితర విభాగాల్లో మొత్తం 191 మందికి మంత్రి కొండా సురేఖ (Konda Surekha) శుక్రవారం నియామక ఉత్తర్వులు అందజేశారు.
మంత్రి సురేఖ మాట్లాడుతూ.. దేవాలయ సేవ ఉపాధి, ఉద్యోగమో కాదన్నారు. అది భగవంతుని సేవ చేసే పవిత్ర బాధ్యతని పేర్కొన్నారు. నిరంతరం దేవుని సేవలో తరించే ఉద్యోగులకు ’అర్చకులు ఇతర ఉద్యోగుల సంక్షేమ నిధి ట్రస్ట్’ ద్వారా ప్రయోజనాలను భారీగా పెంచి అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన దేవాలయాల్లో ప్రత్యేక సందర్భాల్లో ఆధ్యాత్మిక, ధార్మిక, పురాణ ప్రవచనాల నిర్వహణకు త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తామని వెల్లడించారు. పనితీరు ఆధారంగా దేవాలయాల అన్ని విభాగాల ఉద్యోగులకు అవార్డులు ప్రదానం చేస్తామన్నారు.
Endowments Department Jobs | వరుణయాగాలు చేస్తాం
ఎల్‌నినో (El Nino) ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల్లో వరుణయాగాల నిర్వహిస్తామని మంత్రి సురేఖ తెలిపారు. ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి, భక్తులకు నాణ్యమైన సేవలు అందించడానికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఆలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడం ద్వారా నిత్యకైంకర్యాలు, వేదపారాయణాలు, ఉత్సవాలు, ధార్మిక కార్యక్రమాలు మరింత క్రమబద్ధంగా నిర్వహించేందుకు వీలు కలుగుతుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ఇప్పటికే సరస్వతి నది ఆది, అంత్య పుష్కరాలను వైభవోపేతంగా నిర్వహించామని పేర్కొన్నారు. రాబోయే రోజులు గోదావరి, కృష్ణ నదీ పుష్కరాలను అదే స్థాయిలో నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
దీనిని కూడా చదవండి : Telangana EHS Portal | ఉద్యోగులకు ఇక నగదు రహిత వైద్యం: భట్టి విక్రమార్క