అక్షరటుడే, వెబ్‌డెస్క్: NEET Discussion Parliament | పార్లమెంట్లో నీట్ పరీక్షపై చర్చకు సిద్ధమని కేంద్రం ప్రకటించింది. అయితే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) రాజీనామా చేసిన తర్వాతే చర్చ జరపాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. దీంతో సభ సాగడం లేదు.
నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహరం.. ఢిల్లీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఓ వైపు సభలో విపక్షాలు, బయట సీజేపీ ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రతిపక్షాల నినాదాలు, నిరసనల మధ్య, NEET పేపర్ లీక్ అంశంపై సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు లోక్‌సభలో ప్రకటించారు. నిరసనకారులపై పోలీసులు ప్రదర్శించిన దౌర్జన్యం అంశాన్ని ప్రతిపక్షాలు లేవనెత్తాయి. ప్రధాన మంత్రి నుంచి ప్రకటన చేయాలని డిమాండ్ చేశాయి. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ మాట్లాడకపోవడంతోనే తాము ఆయన నివాసం బయట ధర్నా చేయాల్సి వచ్చిందన్నారు.
NEET Discussion Parliament | సభ వాయిదా
చర్చకు ప్రభుత్వం అంగీకరించినప్పటికీ, పార్లమెంటులో చర్చ జరగడానికి ముందే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేశారు. పాలక, ప్రతిపక్ష పక్షాలు రెండూ చర్చను కోరుకుంటున్నాయని చెబుతూ స్పీకర్ ఓం బిర్లా చర్చను ప్రారంభించడానికి ప్రయత్నించారు, కానీ రాజీనామా డిమాండ్ విషయంలో ప్రతిపక్షాలు వెనక్కి తగ్గకపోవడంతో సభను వాయిదా వేయాల్సి వచ్చింది.
NEET Discussion Parliament | స్పీకర్‌తో ఎస్పీ చీఫ్ భేటీ
సభ వాయిదా పడగానే స్పీకర్ ఓం బిర్లాతో సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ భేటీ కాగా, మరోవైపు హోంమంత్రి అమిత్ షాతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ భేటీ అయ్యారు. జేపీ నడ్డా మంగళవారం సీజేపీతో చర్చలు జరిపారు. ఈ సారి చర్చలకు జంతర్ మంతర్ వద్దకు రావాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Supreme Court Remarks | సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు