Jakranpally Airport | జక్రాన్​పల్లిలో ఎయిర్​పోర్ట్​ కల సాకరమయ్యేనా.. ఎదురుచూస్తున్న ఉమ్మడిజిల్లా వాసులు

జక్రాన్‌పల్లి విమానాశ్రయం కల ఎప్పుడు సాకారం అవుతుందో అని ఉమ్మడి జిల్లావాసులు నిరీక్షిస్తున్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, డిచ్​పల్లి : Jakranpally Airport | జక్రాన్‌పల్లి గ్రీన్ ఫిల్డ్ విమానాశ్రాయం అనేది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా (Nizamabad District) ప్రజల దశాబ్దాల కల. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) జక్రాన్‌పల్లిలో విమానాశ్రయ నిర్మాణానికి అనుకూలత ఉందని అధికారికంగా పేర్కొన్నప్పటికీ ఆచరణలో మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు పడట్లేదు.

జక్రాన్​పల్లిలో ఎయిర్​పోర్ట్​ నిర్మాణానికి భౌగోళికంగా ఎలాంటి అభ్యంతరాలు లేవని ‘టెక్నో ఎకనామిక్ ఫిజిబిలిటీ’ వరంగల్(మామునూరు), ఆదిలాబాద్‌లతో పాటు నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి ప్రతిపాదనలకు గతంలోనే అనుమతులు లభించాయి. అయితే, తాజాగా వరంగల్ ఎయిర్‌పోర్ట్ కోసం 953 ఎకరాల భూమిని ఏఏఐకి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. టెండర్ల దశలో ఉందని సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సైతం స్పష్టం చేశారు. అలాగే ఆదిలాబాద్‌లో 1,500 ఎకరాల భూసేకరణ శరవేగంగా జరుగుతుండటంతో నిజామాబాద్ వాసుల్లో ఆందోళన మొదలైంది. అన్ని అర్హతలు ఉండి, సర్వేలు పూర్తయినా నిజామాబాద్ పేరు ప్రస్తుత క్రియాశీలక జాబితాలో కనిపించకపోవడం ఉమ్మడి జిల్లా ప్రజలను తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది.

Jakranpally Airport | భౌగోళిక అనుకూలతలు..

జక్రాన్‌పల్లి మండలంలో ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి సంబంధించి గతంలోనే క్షేత్రస్థాయిలో విస్తృతమైన సర్వేలు జరిగాయి. ఈ ప్రాజెక్ట్ సాంకేతిక, భూగర్భ వివరాలు అనుకూలంగా గుర్తించారు. తొర్లికొండ, కొలిప్యాక, అర్గుల్, మనోహరాబాద్, జక్రాన్‌పల్లిలో మొత్తం 1,668 ఎకరాలు గుర్తించి ప్రాథమిక సర్వే పూర్తి చేశారు. ఈ ప్రాంతం 44వ నంబరు జాతీయ రహదారికి అత్యంత సమీపంలో ఉండటంతో అనుసంధానం చాలా సులభం అవుతుంది. నిజామాబాద్ నగరంతో పాటు నిర్మల్, జగిత్యాల, కామారెడ్డి జిల్లాల ప్రజలకు ఇది కేంద్ర బిందువుగా మారుతుంది. ఏఏఐ తన నివేదికలో ఇక్కడ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయానికి రన్‌వే నిర్మాణం, ఏప్రెన్, టెర్మినల్ బిల్డింగ్‌ల ఏర్పాటుకు భౌగోళికంగా ఎలాంటి అడ్డంకులు లేవని, వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలమని స్పష్టం చేసింది.

Jakranpally Airport | గల్ఫ్ కార్మికులు అధికం

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు, గల్ఫ్ దేశాలకు విడదీయరాని బంధం ఉంది. దుబాయ్, సౌదీ అరేబియా, ఒమన్, ఖతార్, కువైట్, బహ్రెయిన్​కు వలస వెళ్లే కార్మికుల్లో అత్యధిక శాతం మంది ఉమ్మడి నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల ప్రాంతానికి చెందినవారే అత్యధికంగా ఉన్నారు. అలాగే యూరప్, అమెరికా, లండన్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో స్థిరపడ్డ, ఉన్నత చదువులు అభ్యసిస్తున్న వారు అనేక మంది. వేలాది మంది గల్ఫ్ కార్మికులు ప్రతీ రోజూ హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్ళాల్సి వస్తోంది. నిజామాబాద్ నుండి శంషాబాద్ చేరుకోవడానికి కనీసం 5 గంటలకు పైగా సమయం పడుతుంది. రవాణా ఖర్చులు, సమయం వృథాతో పాటు, అత్యవసర సమయాల్లో (ఉపాధి కోల్పోయి రావడం, అనారోగ్యం, ప్రమాదాలు జరిగినప్పుడు) కార్మికులు, వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Jakranpally Airport | ఆర్థిక వ్యవస్థకు ఊతం..

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఆర్థిక వ్యవస్థలో గల్ఫ్ నుంచి వచ్చే విదేశీ ద్రవ్యం కీలక పాత్ర పోషిస్తోంది. ఇక్కడే ఎయిర్‌పోర్ట్ ఉంటే, భవిష్యత్తులో అంతర్జాతీయ సర్వీసులు, కనెక్టింగ్ సర్వీసులు పెరిగి, గల్ఫ్ కార్మికుల ప్రయాణ ఖర్చులు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.

Jakranpally Airport | బలమైన రాజకీయ ప్రాతినిథ్యం

ప్రస్తుత రాజకీయ సమీకరణాల నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాకు ఎయిర్‌పోర్ట్ సాధించుకోవడం పెద్ద కష్టమేమీ కాదని మేధావులు, ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతం అధికార కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఎమ్మెల్యేల బలం ఉంది. జిల్లాకు చెందిన ఇద్దరు నేతలు ప్రభుత్వ సలహాదారులుగా ఉన్నారు. వీటన్నింటికీ మించి అధికార కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్​ నిజామాబాద్ జిల్లాకు చెందిన వారే కావడం విశేషం. ఇంతటి బలమైన రాజకీయ ప్రాతినిథ్యం ఉన్న తరుణంలో, సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు దృష్టికి జక్రాన్‌పల్లి ఎయిర్‌పోర్ట్ ఫైల్‌ను తీసుకెళ్లాలని ప్రజలు కోరుతున్నారు. వరంగల్, ఆదిలాబాద్ తరహాలోనే ఇక్కడ కూడా భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసి, కేంద్రం నుంచి అనుమతులు వచ్చేలా ఒత్తిడి తేవాల్సిన బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులపై ఉందని ప్రజలు పేర్కొంటున్నారు.

Jakranpally Airport | ఎయిర్ పోర్టు ఏర్పాటుతో ప్రయోజనం

ఎయిర్‌పోర్ట్‌ ఏర్పాటైతే ఉత్తర తెలంగాణ ముఖచిత్రం మారిపోతుంది. జక్రాన్‌పల్లి విమానాశ్రయం కేవలం ప్రయాణికుల కోసమే కాకుండా, ఉత్తర తెలంగాణ పారిశ్రామిక, వ్యవసాయ రంగాన్ని మలుపు తిప్పగల సామర్థ్యం ఉంటుంది. నిజామాబాద్ జిల్లా పసుపు, వరి పంటలకు ప్రసిద్ధి. ఇక్కడ ఎయిర్‌పోర్ట్ వస్తే రవాణా సౌకర్యాలు మెరుగై, ఇక్కడి వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు ఎగుమతి చేసే అవకాశం లభిస్తుంది. ఎయిర్‌పోర్ట్ అనుబంధ పరిశ్రమలు, హోటళ్లు, రవాణా రంగం అభివృద్ధి చెంది స్థానిక యువతకు వేలాది ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

ఇది కూడా చదవండి..: Lakshmikant Rao | ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్న మోదీ ప్రభుత్వం: ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *