అక్షరటుడే, కామారెడ్డి : BRS Tribal Development | బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే తండాల అభివృద్ధి జరిగిందని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. గిరిజనులకు 6 నుంచి 10 శాతం రిజర్వేషన్ పెంచిన రోజు సందర్భంగా గురువారం రామారెడ్డి మండలం (Rama Reddy Mandal) జగదాంబ తండాలో మాజీ సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
BRS Tribal Development | గిరిజనుల అభివృద్ధి కోసం..
గంప గోవర్ధన్ మాట్లాడుతూ.. గిరిజనుల అభివృద్ధి కోసం మాజీ సీఎం కేసీఆర్ కృషి చేశారన్నారు. 6 శాతం ఉన్న గిరిజన రిజర్వేషన్లను 10 శాతానికి పెంచిన ఘనత కేసీఆర్కు దక్కుతుందన్నారు. రిజర్వేషన్లు పెరగడంతో అనేక మంది గిరిజనులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగాయన్నారు. తండాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలన్న ఉద్దేశ్యంతో 500 జనాభా ఉన్న తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి తండాల అభివృద్ధికి కృషి చేశామన్నారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో గిరిజనులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తోందన్నారు.
గత ప్రభుత్వ హయాంలో పోడు భూములను గిరిజనులకు సాగు కోసం ఇస్తే ఈ ప్రభుత్వం అధికారులను ఉసిగొల్పి గిరిజనులపై దాడులు చేయిస్తోందని ఆరోపించారు. గిరిజనుల జోలికి వస్తే ఖబడ్దార్ అంటూ సీఎం రేవంత్ రెడ్డిని హెచ్చరించారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, మళ్ళీ తండాల అభివృద్ధి చేసుకుందామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బుక్యా లతబాయి నంద, ఉప సర్పంచ్ రాజు నాయక్, స్కూల్ తండా సర్పంచ్ సలావత్ బుచ్చిరెడ్డి, బట్టు తండా ఉప సర్పంచ్ కిషోర్, మాజీ జడ్పీటీసీ మినుకూరి రాంరెడ్డి, మాజీ ఎంపీపీ దశరథ్ రెడ్డి, మాజీ ఎంపీటీసీల ఫోరమ్ అధ్యక్షుడు రాజగౌడ్, సర్పంచుల ఫోరమ్ మాజీ అధ్యక్షుడు రాంరెడ్డి, మాజీ ఎంపీటీసీ చంద్రు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Praja Palana Day | కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం