అక్షరటుడే, ఎల్లారెడ్డి: Bikkunur Bus Accident | పెళ్లి వేడుకకు సంతోషంగా బయలుదేరిన వారిని రోడ్డు ప్రమాదం భయాందోళనకు గురిచేసింది. రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లారీని టూరిస్ట్ బస్సు ఢీకొట్టడంతో 25 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా (Kamareddy District) భిక్కనూరు సమీపంలోని జాతీయ రహదారిపై చోటుచేసుకుంది.
Bikkunur Bus Accident | బీర్కూరు నుంచి కోదాడకు..
వివరాల్లోకి వెళ్తే.. బీర్కూరు మండలం నుంచి కోదాడలో జరుగుతున్న వివాహ వేడుకకు ప్రయాణికులతో టూరిస్ట్ బస్సు బయలుదేరింది. ఈ క్రమంలో భిక్కనూరు సమీపంలో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లారీని బస్సు ఢీకొట్టింది. డ్రైవర్ అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రయాణికులు పేర్కొన్నారు. సుమారు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న బస్సు ఒక్కసారిగా లారీని ఢీకొనడంతో ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాద తీవ్రతకు బస్సులోని ప్రయాణికులు ముందున్న సీట్లకు, ఒకరినొకరు ఢీకొని గాయపడ్డారు. బస్సు నుంచి బయటకు వచ్చే ద్వారాలు సైతం లాక్ కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
బస్సులో గాయపడిన క్షతగాత్రులను అద్దాలు పగలగొట్టి బయటకు తీసుకువచ్చి న సిబ్బంది, తోటి ప్రయాణికులు క్షతగాత్రులను అంబులెన్సుల ద్వారా కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారికి వైద్య చికిత్సలు అందించారు. కామారెడ్డి మెడికల్ కాలేజీ ఆర్‌ఎంవో డాక్టర్ రవీందర్ గౌడ్, డ్యూటీ డాక్టర్లు ఆసుపత్రిలో ఉండి బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారు. అనంతరం ప్రయాణికులు క్షేమంగా తమ గమ్యస్థానాలకు చేరుకునేలా ఏర్పాట్లు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే పెళ్లి వేడుకకు వెళ్తుండగా ప్రమాదం జరగడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని బాధితులు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి..: Municipal Politics | వైస్ ఛైర్మన్ వెంట భర్త రావడం లేదా..? బీఆర్ఎస్పై కాంగ్రెస్ కౌన్సిలర్ల ఫైర్