Municipal Politics | వైస్ ఛైర్మన్ వెంట భర్త రావడం లేదా..? బీఆర్ఎస్​పై కాంగ్రెస్ కౌన్సిలర్ల ఫైర్

కామారెడ్డి మున్సిపాలిటీలో అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్ల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. బీఆర్ఎస్​ కౌన్సిలర్ల తీరుపై కాంగ్రెస్ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Municipal Politics | కామారెడ్డి మున్సిపాలిటీ (Kamareddy Municipality)లో అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్ల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఛైర్మన్ భర్త మున్సిపాలిటీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారంటూ బీఆర్ఎస్ కౌన్సిలర్లు చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ కౌన్సిలర్లు ఘాటుగా స్పందించారు.

Municipal Politics | బీఆర్ఎస్ కౌన్సిలర్లు రౌడీలు, గుండాల మాదిరిగా..

మున్సిపల్ కార్యాలయంలోశుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ కౌన్సిలర్లు రౌడీలు, గుండాల మాదిరిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఛైర్మన్ భర్తపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గత పదేళ్లుగా కామారెడ్డిలో మహిళా చైర్మన్లే ఉన్నారు. మరి అప్పుడు వారి భర్తలు మున్సిపాలిటీకి రాలేదా? అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు? గురువారం వైస్ ఛైర్మన్​తో పాటు ఆమె భర్త రాలేదా? రాజకీయాల్లో ఉన్న మహిళలకు అండగా భర్తలు ఉండడం సహజం. దాన్ని తప్పుగా చిత్రీకరించడం సరికాదు అని మండిపడ్డారు. సీసీ కెమెరాల యాక్సెస్ ఛైర్మన్ వద్ద మాత్రమే ఉందని, ఛైర్మన్ భర్త వద్ద లేదని స్పష్టం చేశారు. సీసీ కెమెరాలను ఇష్టానుసారం కెమెరాలను తొలగిస్తుండడంతోనే ఛైర్మన్ వద్దే యాక్సెస్ ఉంచుకున్నారని తెలిపారు. ఈ విషయమై విచారణ జరపాలని కమిషనర్​కు చెప్పినా స్పందన లేదని, సీసీ కెమెరాలు మాత్రమే తీసేసారా.. ఇంకా ఏవైనా ఫైల్స్ కూడా తీసేసారా అనే విషయమై ఫిర్యాదు చేయడానికి బీఆర్ఎస్ కౌన్సిలర్లు దమ్ముంటే తమతో కలిసి రావాలని సవాల్ చేశారు.

Municipal Politics | అక్రమ నిర్మాణాలను ఉపేక్షించేది లేదు..

పట్టణంలోని 16వ వార్డులో మున్సిపల్ స్థలంలో జరుగుతున్న ఇంటి నిర్మాణానికి తాము మద్దతు ఇస్తున్నామనడం అవాస్తవమన్నారు. అక్రమ నిర్మాణాలు జరిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని, వాటిని తొలగిస్తామని స్పష్టం చేశారు. సిబ్బందిని నిర్మాణ స్థలానికి పంపి కమిషనర్ ను కలవాలని, డబ్బులు ఇవ్వాలని చెప్పడాన్ని మాత్రమే తప్పు పట్టామని వివరించారు. జనరల్ బాడీ సమావేశం నిర్వహించాలని గత నెలలోనే కమిషనర్​కు చెప్పడం జరిగిందన్నారు. బతుకమ్మ పండుగ నిధులు, ప్రతి వార్డుకు రూ.6 లక్షల నిధుల కేటాయింపుపై బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు. రూ.6 లక్షల కేటాయింపు ఫైల్​పై ఛైర్మన్ సంతకం చేశారని గుర్తుచేశారు. కలెక్టర్ మంజూరు చేసిన బతుకమ్మ నిధులపై కలిసి వెళ్లి కమిషనర్ ను అడుగుదామన్నారు.

Municipal Politics | మెడపట్టి గెంటేస్తామనడం రౌడీయిజం కాదా?

గణేష్ నిమజ్జనం తర్వాత స్క్రాప్ అమ్మకంపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి, నిజమని తేలితే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఛైర్మన్ భర్త కార్యాలయానికి వస్తే మెడపట్టి గెంటేస్తామనడం రౌడీయిజం కాదా? అని ప్రశ్నించారు. తమకు మాట్లాడటం రాక కాదు, అభివృద్ధిలో కలిసి వెళ్దామనే ఉద్దేశంతోనే సంయమనం పాటిస్తున్నామన్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్​తో మిత్రపక్షంగా ఉండి, పరస్పర అంగీకారంతోనే వైస్ ఛైర్మన్, కో-ఆప్షన్ పదవులు తీసుకున్నామని, అభివృద్ధిలో కలిసి వస్తారనుకుంటే రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. కో–ఆప్షన్ సభ్యుడు కుంబాల రవి యాదవ్ తన వెంచర్​ను కాపాడుకునేందుకే ఈ మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. కామారెడ్డి అభివృద్ధి కోసం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కృషి చేస్తున్నారని, పట్టణ అభివృద్ధికి పార్టీలకు అతీతంగా సహకరించాలని కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు కొత్తపల్లి లలిత, సుల్తానా, సావిత్రి, తహిసున్నిసా, వాజీద్, బబ్లు, జావీద్, అంజాద్, గంగాధర్, కో–ఆప్షన్ సభ్యులు అలీ భీన్ అబ్దుల్లా, గొనె సునీత తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Chandrayampally Culvert Works | చంద్రాయన్​పల్లి వద్ద కల్వర్టు పనులు త్వరగా పూర్తి చేయాలి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *