Aryan Shukla World Records | ఏఐ కంటే ఫాస్ట్.. మైండ్‌తోనే వరల్డ్ రికార్డ్స్ బ్రేక్ చేస్తున్న ఇండియన్ జీనియస్!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత వేగంగా సమాధానాలు ఇచ్చినా, తన మెదడుతో క్షణాల్లో అంతకంటే వేగంగా లెక్కలు తేల్చేస్తున్నాడు 16 ఏళ్ల ఆర్యన్ శుక్లా.

Shivam nagarani

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Aryan Shukla World Records | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) ఎంత వేగంగా సమాధానాలు ఇచ్చినా, తన మెదడుతో క్షణాల్లో అంతకంటే వేగంగా లెక్కలు తేల్చేస్తున్నాడు 16 ఏళ్ల ఆర్యన్ శుక్లా. మహారాష్ట్రలోని నాశిక్‌కు చెందిన ఈ బాలుడు తన అసాధారణ జ్ఞాపకశక్తి, గణన వేగంతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాడు. చిన్న వయసులోనే ఏకంగా 9 గిన్నిస్ వరల్డ్ రికార్డులను తన పేరిట లిఖించుకోవడమే కాకుండా, కేవలం 12 ఏళ్లకే ‘మెంటల్ కాలిక్యులేషన్ వరల్డ్ కప్’ గెలుచుకుని భారత్ గర్వించదగ్గ ‘హ్యూమన్ కాలిక్యులేటర్’గా పేరుగాంచాడు.

Aryan Shukla World Records | ఆరేళ్ల వయసులోనే ..

ఆర్యన్ ప్రయాణం ఆరేళ్ల ప్రాయంలో సంఖ్యలపై ఉన్న సాధారణ కుతూహలంతో మొదలైంది. కొడుకులోని ప్రత్యేక ప్రతిభను ముందుగానే గుర్తించిన తండ్రి నితిన్ శుక్లా, అతడికి సరైన ప్రోత్సాహం అందించారు. 2018లో ఇస్తాంబుల్‌లో జరిగిన ‘మెమోరియాడ్ టర్కీ ఓపెన్ ఛాంపియన్‌షిప్’లో 8 ఏళ్ల ఆర్యన్ 7 స్వర్ణాలతో సహా మొత్తం 10 పతకాలు సాధించి, రెండు జూనియర్ వరల్డ్ రికార్డులను సృష్టించాడు.

Aryan Shukla World Records | వరల్డ్ కప్ ఛాంపియన్‌గా ..

జులై 2022లో జర్మనీలో జరిగిన ‘మెంటల్ కాలిక్యులేషన్ వరల్డ్ కప్’లో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన 40 మంది దిగ్గజాలను ఓడించి ఆర్యన్ ఛాంపియన్‌గా నిలిచాడు. అంతవరకు ఈ విభాగంలో ఉన్న జపాన్ ఆధిపత్యాన్ని తిరగరాసాడు. సెప్టెంబర్ 2024లో తన టైటిల్‌ను నిలబెట్టుకోవడమే కాకుండా, 900 మార్కులకు గానూ 819.84 మార్కులు సాధించి.. కూడికలు, గుణకారాలు, వర్గమూలాలు (Square roots), కాలెండర్ డేట్స్ వంటి ఆరు ప్రధాన విభాగాల్లోనూ ట్రోఫీలను, 5 ప్రపంచ రికార్డులను సొంతం చేసుకున్నాడు.

Aryan Shukla World Records | ఒక్క రోజే 6 గిన్నిస్ రికార్డులు..

ఫిబ్రవరి 2024లో ఇటలీ టీవీ షో లో షో డీ రికార్డ్’లో 25.19 సెకన్లలో 50 ఐదు అంకెల సంఖ్యలను కూడి తొలి గిన్నిస్ రికార్డ్ సాధించాడు. ఆపై డిసెంబర్ 4న దుబాయ్‌లో ఒక్క రోజే ఆరు రికార్డులను తిరగరాశాడు. 50 ఐదు అంకెల సంఖ్యలను 18.71 సెకన్లలో, 100 నాలుగు అంకెల సంఖ్యలను 30.9 సెకన్లలో కూడి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఏప్రిల్ 2026లో ఇటలీలో పది 8-అంకెల సంఖ్యలకు వర్గమూలాలను 71.22 సెకన్లలో కనుగొని మరో రెండు గిన్నిస్ రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.

Aryan Shukla World Records | చదువులోనూ ఫస్ట్..

ప్రస్తుతం నాశిక్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో 11వ తరగతి చదువుతున్న ఆర్యన్, పదో తరగతిలో 97 శాతం మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. కేవలం రికార్డులకే పరిమితం కాకుండా ‘గ్లోబల్ మెంటల్ కాలిక్యులేటర్స్ అసోసియేషన్’ (GMCA) వ్యవస్థాపక బోర్డు సభ్యుడిగా ఉంటూ ఆన్‌లైన్ తరగతుల ద్వారా ఇతర పిల్లల్లోని గణిత భయాన్ని పోగొడుతున్నాడు. 2025 నవంబర్‌లో సౌదీ అరేబియాలోని ‘మిస్క్ గ్లోబల్ ఫోరమ్’లో ప్యానెలిస్ట్‌గా కూడా ప్రసంగించాడు.

Aryan Shukla World Records | తల్లిదండ్రుల ప్రోత్సాహమే ..

పిల్లలపై తమ సొంత కలలను రుద్దకుండా, వారిలోని ఆసక్తులను గుర్తించి స్వేచ్ఛనివ్వాలని ఆర్యన్ తల్లిదండ్రులు సందేశమిస్తున్నారు. ఏడేళ్ల శ్రమ, తల్లిదండ్రుల నిరంతర మద్దతుతో ఆర్యన్ ఈ స్థాయికి చేరుకున్నాడు. టెక్నాలజీ ఎంత పెరిగినా మనిషి మెదడు సామర్థ్యానికి, క్రమశిక్షణతో కూడిన సాధనకు తిరుగులేదని ఆర్యన్ శుక్లా నిరూపిస్తున్నాడు.

ఇది కూడా చదవండి..: Delhi Rally Postponement | ‘ఛలో ఢిల్లీ’ ర్యాలీని వాయిదా వేయండి.. సోనియాకు వ్యాపారుల లేఖ

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *