అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Consensual Relationship | ఇద్దరి ఇష్టపూర్వక సమ్మతితో శారీరక సంబంధం పెట్టుకుని, ఆ తర్వాత మనస్పర్థలు వచ్చి బంధం విఫలమైతే దాన్ని అత్యాచారంగా పరిగణించలేమని సుప్రీంకోర్టు (Supreme Court) స్పష్టం చేసింది. కేరళకు చెందిన సంతోష్ కుమార్ ఎన్.పి. అనే వ్యక్తిపై నమోదైన రేప్, మోసం కేసులను రద్దు చేస్తూ జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఆర్. మహదేవన్‌ల ద్విసభ్య ధర్మాసనం ఈ కీలక తీర్పును వెలువరించింది.
Consensual Relationship | సమ్మతికి-పశ్చాత్తాపానికి తేడా ..
ప్రారంభం నుంచే మోసం చేసే దురుద్దేశంతో పొందే సమ్మతి వేరని, బంధం విఫలమయ్యాక కలిగే పశ్చాత్తాపం వేరని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సుదీర్ఘకాలం ఇష్టపూర్వకంగా కలిసి ఉండి, ఆ తర్వాత సంబంధం తెగిపోయిందనే ఏకైక కారణంతో అత్యాచారం ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొంది. రేప్ కేసు పెడతారనే భయంతో ఒక పురుషుడు ఇష్టం లేకపోయినా ఆ బంధంలోనే బందీగా ఉండిపోవాలని అనుకోవడం అతని స్వేచ్ఛను హరించడమే అవుతుందని, నచ్చని బంధం నుంచి బయటకు వచ్చే హక్కు పురుషుడికి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది.
Consensual Relationship | విఫలమైన ప్రేమలు..
విఫలమైన ప్రేమ బంధాలను క్రిమినల్ కేసులుగా మార్చే ధోరణి ఇటీవల పెరుగుతుండటంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. నిజమైన లైంగిక దాడి, బలవంతపు చర్యలు, మోసపూరిత సమ్మతి చోటుచేసుకున్నప్పుడు మాత్రమే అత్యాచారం సెక్షన్లను ఉపయోగించాలని హెచ్చరించింది. విఫలమైన ప్రతీ సంబంధాన్ని రేప్ కేసుగా మార్చుకుంటూ పోతే, ఆ నేరం ప్రాముఖ్యతే తగ్గిపోతుందని అభిప్రాయపడింది.
Consensual Relationship | కేసు నేపథ్యం ఇదే..
సంతోష్ కుమార్ అనే వ్యక్తి తన మొదటి పెళ్లి విషయాన్ని దాచిపెట్టి, 1996 నుంచి 2003 వరకు మైసూర్‌తో సహా పలు ప్రాంతాల్లో తనతో కలిసి జీవించి మోసం చేశాడని ఓ మహిళ కేసు పెట్టింది. దీనిపై కేరళ హైకోర్టును ఆశ్రయించినా ఉపశమనం లభించకపోవడంతో ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారు. విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం.. ఇది ఏడేళ్లపాటు పరస్పర సమ్మతితో సాగిన సుదీర్ఘ సంబంధమని, ఇందులో ఎలాంటి మోసం లేదని పేర్కొంటూ సంతోష్ కుమార్‌పై ఉన్న కేసులన్నింటినీ కొట్టివేసింది.
ఇది కూడా చదవండి..: Helicopter Crash | ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం.. కూలిన హెలికాప్టర్..